రాష్ట్రంలో గొడవలపై పురందేశ్వరి మౌనం… దేనికో?

Daggubati Purandeswariచంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలలో వైసీపీ కార్యకర్తలు దాడులు, విధ్వంసంపై జాతీయమీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఏపీలో ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇంతవరకు స్పందించలేదు. టిడిపితో బిజెపికి పొత్తులు లేవు కనుక స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా లేక వైసీపీతో తమ అధిష్టానానికి సత్సంబంధాలు ఉన్నందున ఈ గొడవలపై ఏవిదంగా స్పందించాలనే దానిపై అధిష్టానం అభిప్రాయం తెలుసుకొన్న తర్వాత స్పందించాలనుకొంటున్నారో తెలీదు.

కానీ రాష్ట్రంలో అధికార వైసీపీ అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, స్వయంగా దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఆరోపించినప్పుడు, ఆమె కళ్లెదుటే ఇన్ని గొడవలు, ఇంత విధ్వంసం జరుగుతున్నా మౌనం వహించడం ప్రజలకు తప్పుడు సంకేతాలే పంపుతోంది. రాష్ట్రంలో వైసీపీతో కత్తులు దూస్తున్నప్పటికీ ఆ పార్టీతో బిజెపి సక్యతనే కోరుకొంటోందని ఆమె మౌనం సూచిస్తున్నట్లుంది.

ADVERTISEMENT

అయితే బిజెపితో పొత్తులో ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఈ దాడులను ఖండించారు. ఆయన కూడా వైసీపీ బాధితుడే కనుక వైసీపీ పాలనలో అరాచకం పెరిగిపోయిందని ఈ దాడులు మరోసారి నిరూపించాయని అన్నారు. ఈనెల 10 నుంచి 19వరకు విశాఖ జిల్లాలో పర్యటించిన్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా ఈ దాడుల గురించి జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించవచ్చు.

పుంగనూరు, తంబళ్ళపల్లి ఘటనలపై టిడిపి నేతలు వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనకు ఈ దాడులకు సంబందించి ఫోటోలు, వీడియో క్లిప్పింగులు అందజేసి వైసీపీ ప్రభుత్వాన్ని అదుపులో పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. నేడు పల్నాడులో టిడిపి సానుభూతిపరుడు కోటయ్యపై వైసీపీ నేత కృష్ణమూర్తి మళ్ళీ మరోసారి దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేస్తుంటే ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకు లేదా? చంద్రబాబు నాయుడుపై వైసీపీ గూండాలు దాడిచేస్తున్నప్పుడు, అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు. మాపై వైసీపీ దాడులు చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకొని వారిపై కేసులు నమోదు చేయకుండా, వైసీపీ కార్యకర్తలతో కలిసి మాపై లాఠీ ఛార్జ్ చేయడం ఏమిటి? మాపై కేసులు నమోదు చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు.

ADVERTISEMENT
Latest Stories