వైసీపీ అధినేత జగన్ విదేశంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు హడావుడిగా ప్రకటించారు. ఆక్రమాస్తుల కేసుల నుంచి ఉపశమనం కోసమే అలా ప్రకటించారని అప్పుడే వార్తలు వచ్చాయి.
కానీ వాటిని ఖండిస్తూ తన ఈ నిర్ణయం వలన రాజకీయంగా బలహీనంగా మారానని విజయసాయి రెడ్డి చెప్పుకున్నారు. కానీ వాస్తవమేమిటంటే, ఆక్రమాస్తుల కేసుల విచారణ ఇప్పటికే ఓ పుష్కరం పూర్తయింది. మరో రెండు పుష్కరాలు సాగినా ఆశ్చర్యం లేదు. కనుక వాటి గురించి ఆయనకు ఎటువంటి చింత ఉండదు.
కానీ కాకినాడ పోర్టు కేసు నుంచి తప్పించుకోవడం కష్టం. కనుక త్వరలోనే బీజేపిలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడుని కాదని ఆయనని బీజేపిలో చేర్చుకుంటుందా?ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ చేర్చుకుంటే ఏపీ ప్రభుత్వం ఇక ఆయనని టచ్ చేయలేదు.
ఇప్పటికే ఏపీ సీఐడీ ఆయనపై కేసు నమోదు చేసినందున, బుధవారం ఉదయం విజయవాడలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసిందిగా నోటీస్ పంపింది. ఆయన ఈరోజు విచారణకు హాజరవుతారో లేదో మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.
ఈ కేసులో విజయసాయి రెడ్డి ప్రమేయం ఉందనే విషయం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి కూడా తెలిసే ఉంటుంది. ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. కనుక ఆయన ఆమోదం తీసుకున్న తర్వాతే విజయాసాయి రెడ్డికి నోటీస్ వెళ్ళిందని భావించవచ్చు.
కనుక ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన విచారణకు హాజరైతే ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నించి అవసరమైతే మళ్ళీ రావాలని చెప్పి పంపించేస్తారా లేక అరెస్ట్ చేసి రిమాండ్‌పై జైలుకి పంపిస్తారా?అనే విషయం ఈరోజు సాయంత్రంలోగా తెలుస్తుంది.
ఒకవేళ విజయసాయిని అరెస్ట్ చేస్తే అది సంచలన వార్తే అవుతుంది. కానీ అక్రమాస్తుల కేసులతో అపార అనుభవం సంపాదించుకున్న విజయసాయి రెడ్డిని ఈ కేసులో ఏపీ సీఐడీ ఏమైనా చేయగలదా?అంటే మహా అయితే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగలదేమో?
పంపితే బెయిల్‌పై బయటకు రావడం ఆయనకు పెద్ద కష్టం కాదని అందరికీ తెలుసు. కనుక ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా విజయసాయి రెడ్డిని కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదనే భావించవచ్చు.
ఒకవేళ కేంద్రం తలుచుకుంటే ఈడీ కేసులో కదలిక వస్తే ఏమైనా జరుగవచ్చు లేకుంటే వారం-పది రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌తో ఈ కేసు కూడా అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసుల జాబితాలో చేరి అటకెక్కిపోవచ్చు.




