ఏపీ రాజకీయాల్లో పెను “ప్రకంపనలు” సంభవించనున్నాయా?

bhumana-karunakar-reddyఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు చట్టపరమైన విచారణలు ఎదుర్కొవడమే. తునిలో జరిగిన విధ్వంసం నేపధ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని మరోసారి సీఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు. మంగళవారం నాడు గుంటూరులో జరగనున్న ఈ విచారణ అత్యంత ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

ముఖ్యంగా ఈ విచారణలో భూమన కరుణాకరరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల రెండు రోజులు విచారణకు హాజరైన భూమన, విచారణలో తనకు తెలిసిన విషయాలు చెప్పానని, అధికారులు కూడా బాగా సహకరించారని, మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలిచినా తప్పకుండా వస్తానని చెప్పారు. అయితే, తీరా మళ్ళీ సీఐడి విభాగం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసేటప్పటికీ, ‘ఇదంతా ప్రభుత్వ కుట్ర, భూమనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ’ వైసీపీ వర్గం ఆరోపణలు చేస్తోంది.

వైసీపీ ఆరోపణలు ఇలా ఉంటే, తుని విధ్వంసంలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తుని ఘటనలో భూమన ప్రమేయం ఉందన్న విషయం వైసీపీ వర్గాలకు తెలుసు గనుక, భూమన అరెస్ట్ తప్పకపోవచ్చని ప్రచారం చేస్తున్నారంటూ టిడిపి వర్గాలు చెప్తున్నాయి. దీంతో మంగళవారం నాడు జరగనున్న సీఐడి విచారణ వైసీపీకి అత్యంత కీలకంగా మారబోతోంది. భూమనతో పాటు అదే రోజు ‘1’ న్యూస్ ఛానల్ ఎండీ సుధాకర్ కూడా విచారణను ఎదుర్కొనబోతున్నారు. ఈయన కూడా అరెస్ట్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే, ఈ నెల 23వ తేదీన పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొననుండడంతో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. రాంకీ ఫార్మాసిటీకి సంబంధించి ఏ-1 జగన్ తో సహా, ఏ-2 విజయసాయిరెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. దీనిపై కూడా జగన్ వర్గం మీడియా ‘సింపతీ’ కధనాలు ప్రసారం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో?! ఈ విచారణలో జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని, ఇది కేంద్రం – రాష్ట్రం మధ్య కుదిరిన ‘డీల్’ అని, స్పెషల్ ప్యాకేజ్ ను ఒప్పుకుంటే… జగన్ ను అరెస్ట్ చేయాలనే నిబంధనను చంద్రబాబు పెట్టారని, వీరిద్దరూ కలిసి మళ్ళీ జగన్ ను కటకటాల వెనక్కి పంపించాలనే కుట్ర జరుగుతోందంటూ ప్రసారాలు చేస్తోంది. ఏది ఏమైనా… ఈ వారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories