ఇవాళ్ళ, (ఆదివారం) సాయంత్రం బాపట్ల జిల్లా పి.గుడిపాడు వద్ద వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ నిర్వహించబోతున్నారు. ‘సిద్ధం సిరీస్’లో ఇదే చివరి సభ కనుక ఈ సభకు కనీసం 2-3 లక్షల మందిని తరలించి అధినేత మనసు గెలుచుకోవాలని వైసీపి నేతలు నానా తిప్పలు పడుతున్నారు.
ఈ సభని విజయవంతం చేసేందుకు ఉమ్మడి కృష్ణ, ఉభయ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపి నేతలు సంక్షేమ పధకాల లబ్ధిదారులని, వైసీపి కార్యకర్తలని సభకు తరలిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులన్నీ వారిని అక్కడికి మోసుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సభని ‘వైనాట్ 175?’ అనే కాన్సెస్ట్‌తో నిర్వహించబోతున్నట్లు వైసీపి చెప్పుకుంటోంది. కనుక యధాప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సంక్షేమ పధకాల డప్పు కొట్టుకొని, ప్రజలకు మేలు చేస్తున్న మీ ఈ దేవుని బిడ్డకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా కుట్రలు చేస్తున్నాయంటూ ఆక్రోశించక మానరు.
ఆ తర్వాత ‘చంద్రబాబు నాయుడు-అవినీతి’, ‘పవన్ కళ్యాణ్-మూడు పెళ్ళాలు’, ‘దగ్గుబాటి పురందేశ్వరి-కుమ్మకు రాజకీయాలు’, ‘ఎల్లో మీడియా-మేలుకి వ్యతిరేకంగా దుష్ప్రచారం’ తదితర అంశాలపై స్క్రిప్ట్ రీడింగ్ కూడా ఈ కాన్సెస్ట్ సభలో భాగమే.
ఇప్పుడు బీజేపీ కూడా తోడేళ్ళ గుంపులో చేరింది కనుక ఇంతకాలం మోడీ, అమిత్ షాల పట్ల చూపిన విధేయతని ‘కాసేపు’ పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగా అన్యాయం చేసిందో ‘సవినయంగా’ వివరించే ప్రయత్నం కూడా చేయవచ్చు.
పవన్ కళ్యాణ్‌తో బాటు మోడీ, అమిత్ షాలు కూడా చంద్రబాబు నాయుడు బుట్టలో పడిపోయారని వారిపై కాస్త జాలి కూడా చూపవచ్చు.
గుంపులో తోడేళ్ళ సంఖ్య నానాటికీ పెరుగుతున్నా తాను మాత్రం పైన ఆ దేవుడిని, ఎదురుగా ఉన్న మీ అందరినీ నమ్ముకొని ఒంటరిగా యుద్ధానికి సిద్దం అవుతున్నానని మరోసారి జగన్ చెప్పుకోకుండా ఉండరు.
ఓవైపు తనను కనికరించి రెండో ఛాన్స్ ఇమ్మనమని ప్రజలను వేడుకుంటూనే, తాను సింగిల్ సింహంలా ఆ తోడేళ్ళ గుంపులోకి, అర్జునుడులా వాటి పద్మవ్యూహంలోకి ప్రవేశించి చిత్తుచిత్తుగా ఓడించి 175 సీట్లు గెలుచుకోబోతున్నానని అదే నోటితో జగన్ చెప్పకుండా ఉండరు. నిజానికి ఈ సభ కాన్సెస్ట్ అదే కదా?
కనుక ‘సిద్ధం సిరీస్’ చివరి సభలో ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమైనా చెపితే అదొక్కటే వార్త అనుకోవలసి ఉంటుంది.
ఇన్ని కోట్లు ఖర్చు చేసి, ఇన్ని వేల బస్సులు కబ్జా చేసి, అంతమందిని పోగేసి నిర్వహిస్తున్న ఈ సభలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమైనా చెప్తారా లేదో… చూద్దాం!




