కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడుస్తుంది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ భయం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు వైసీపీ నాయకుల రాజకీయం నుండి బయటపడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులేస్తున్నారు.
ఇందుకు ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి, లోకేష్ నిరంతర కృషి అని చెప్పవచ్చు. అయితే కూటమి అధినాయకులు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఇంతలా పరితపిస్తుంటే కింద స్థాయి నాయకులు, మంత్రులు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలన చూసుకుంటే అప్పుడు ప్రభుత్వ మంత్రులందరూ వారి వారి శాఖల పనులు చక్కపెట్టకుండా ప్రత్యర్థి పార్టీల నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తూ ఎప్పుడు మీడియాలోనే దర్శనమిచ్చేవారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే బాబు కి వయసు అయిపోతుందా అని,
రాజధాని తో మూడు ముక్కలాట ఎందుకు అంటే పవన్ మూడు పెళ్లిళ్లు తప్పుకాదా అంటూ, వైసీపీ పాలన సరిగా లేదు అంటే లోకేష్ పప్పు అంటూ ఇలా ప్రశ్న ఏదైనా జవాబు మాత్రం వెటకారం, వెక్కిరింపే అన్న చందంగా వైసీపీ మాజీ మంత్రుల వ్యవహారశైలి కనిపించింది.
అవసరం లేకున్నా, సందర్భం రాకున్నా ప్రతిపకక్షాన్ని అణిచివేసేందుకు ఈ నా అధికారం అన్నట్టుగా సాగింది వైసీపీ పాలన. అయితే నాడు అతివృష్టిలా సాగిన వైసీపీ ప్రభుత్వ తీరుకి పూర్తి భిన్నంగా నేడు అనావృష్టి మాదిరి వెళుతుంది కూటమి.
అధికారంలో ఉండి కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అసత్య వార్తలను, విష ప్రచారాలను కూటమి నేతలు కానీ మంత్రులు కానీ అవసరమైన మేరకు ఖండించలేకపోతున్నారు. చివరికి వైసీపీ రాజధాని పై తప్పుడు కథనాలు ప్రచురించినా, టీటీడీ వంటి పవిత్ర పుణ్య క్షేతం పై అసత్య వార్తలు ప్రచారం చేసినా కూటమి పార్టీల నుంచి అదే స్థాయిలో ఖండన రావడం లేదు.
ఒక పక్క రాష్ట్ర బ్రాండింగ్ ను ప్రమోట్ చేస్తూ మరో పక్క పాలన వ్యవహారాలను చక్కదిద్దుతూ, ఇంకో పక్కన పార్టీ భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తూ చివరికి ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విష ప్రచారాల పై కూడా ముఖ్యమంత్రి బాబే స్పందిస్తున్నారు, వైసీపీ చర్యలను తప్పుబడుతున్నారు.
నాడు వైసీపీ హయాంలో పరిధి దాటి విస్తరించిన ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు నేడు కనీసం తన పరిధిలో విషయాన్ని సైతం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు, ప్రత్యర్థి పార్టీ పై ఎదురుదాడి చేయలేకపోతున్నారు.నాటి వైసీపీ అతివృష్టి రాష్ట్రానికి ఎంత హాని చేసిందో నేటి కూటమి అనావృష్టి సైతం ఏపీకి చేస్తూనే తెస్తుంది.







