సాధారణంగా ఎన్నికల సమయంలో నేతలు టికెట్స్ అమ్ముకున్నారనే ఆరోపణ వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలలో ఈ ఆరోపణ తప్పకుండా వినిపిస్తుంటుంది. నిప్పు లేనిదే పొగరాదు కనుక వాటిలో ఎంతో కొంత నిజమే ఉంటుంది.
అయితే పదేళ్లుగా ఏపీలో ఉనికే లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యర్ధుల ఎంపికలో ఇలాంటి ఆరోపణలు వినిపించడం విడ్డూరంగానే ఉంటుంది.
కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపికలో వైఎస్ షర్మిల తమ వంటి సీనియర్లను సంప్రదించకుండా తనకు నచ్చిన్నట్లు టికెట్స్ కేటాయించారని, అభ్యర్ధుల ఎంపికలో భారీగా డబ్బు చేతులు మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆరోపించారు. అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభ్యర్ధుల నుంచి డబ్బు తీసుకొని టికెట్స్ అమ్ముకున్నారని ఆయన ఆరోపిస్తున్నట్లు అర్దమవుతోంది.
ఈసారి ఎన్నికలు వైసీపి, టిడిపి, జనసేనలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఏది ఓడిపోయినా ఇక వాటి మనుగడ చాలా కష్టం అవుతుంది. కనుక మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. పోరాడుతాయని ముందే కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు.
కనుక మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడుకుంటున్నప్పుడు, వాటి మద్యకు వెళితే ఏమవుతుందో చింతా మోహన్ వంటి సీనియర్ నాయకుడికి తెలియదనుకోలేము. ఈ ఎన్నికలలో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా వస్తాయో రావో తెలీని పరిస్థితిలో కాంగ్రెస్ టికెట్ల కోసం ఎవరైనా డబ్బు చెల్లిస్తారనుకోవడం అజ్ఞానమే అవుతుంది.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులు కూడా పోటీ చేసిన మాట వాస్తవం. అయితే కడప నుంచి లోక్‌సభకు పోటీ చేసిన వైఎస్ షర్మిల పేరు తప్ప మరెవరి పేరు ఈ ఎన్నికలలో వినిపించనే లేదు. చాలా నియోజకవర్గాలలో అసలు కాంగ్రెస్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారా లేరా? అనే అనుమానం కలిగింది.
ఈ ఎన్నికలలో వైసీపిని, టిడిపిని వద్దనుకున్న ఓటర్లు కాంగ్రెస్‌కు ఓట్లు వేసే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవకపోయినా వైసీపి ఓటర్లను ఎంతో కొంత చీల్చగలరు.
కానీ ఈ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 4-5 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా, ఏపీలో వైఎస్ షర్మిలకు రాజకీయ పునాది పడిన్నట్లే… కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగేందుకు ఏపీ ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లే.
అలాకాక పార్టీలో ఆమె ఒక్కరే కడప ఎంపీ సీటు గెలుచుకుంటే అది ఆమెకు రాజకీయంగా ఓ మెట్టు పైకి ఎక్కిన్నట్లు అవుతుంది కానీ ఆ ఒక్క సీటుతో ఏపీ కాంగ్రెస్‌కు కొత్తగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు.




