AP Govt Suspends Former CID Chief PV Sunil Kumar

ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీస్ అధికారి సునీల్ కుమార్‌ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ ఆ పార్టీ నేతల కంటే ఎక్కువగా జగన్‌కి వీర విధేయుడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు చాలా ప్రాధాన్యత ఉండేది. కనుక అప్పుడు తరచూ విదేశాలకు వెళ్ళి వస్తుండేవారు. కానీ అమెరికా వెళ్తున్నానని చెప్పి యూకే, జార్జియా వెళ్తున్నానని చెప్పి దుబాయ్‌కి, దుబాయ్‌ అని చెప్పి అమెరికాకి వెళ్ళివస్తుండేవారు. ఈవిధంగా చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్దమని తెలిసినా అప్పటి ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదు.

కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయనని ఆ పదవిలో నుంచి తప్పించేసి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా సర్వీసు నిబంధనలకు విరుద్దంగా విదేశీ పర్యటనలు చేసినందుకు ఇప్పుడు ఆ ఉద్యోగంలో నుంచి కూడా సస్పెండ్ చేశారు.

Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!

ఆయన విదేశీ పర్యటనలపై రెవెన్యూ కార్యదర్శి మనీష్ సిసోడియా నేతృత్వంలో కమిటీ విచారణ జరిపి సర్వీసు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని నిర్ధారణ చేసింది. కనుక ఆ నివేదిక ఆధారంగా సునీల్ కుమార్‌ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం మారి, తనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినా సునీల్ కుమార్‌ తీరు మారలేదు. జగన్‌ పట్ల అచంచల భక్తి తగ్గలేదు. అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడుపై తరచూ విమర్శలు చేస్తుంటారు. రాష్ట్రంలో ఎస్సీలను సిఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని కనుక వారు చంద్రబాబు నాయుడుపై తిరుగబడాలని సూచించి ఓ ఐపీస్ అధికారిగా చేయకూడని తప్పు చేశారు. కనుక ఇక ఆయనని ఉపేక్షించాల్సిన అవసరం లేదని భావించిన కూటమి ప్రభుత్వం సునీల్ కుమార్‌ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది.

Also Read – సింహంలాంటి జగన్‌కి ఈ కష్టాలు ఏమిటో!


మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ డెప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజుని విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సునీల్ కుమార్ ఐపీస్ కవచం కూడా తొలగిపోవడంతో ఆ కేసులో ఆయనపై పోలీసులు తగు చర్యలు చేపట్టడానికి లైన్ క్లియర్ అయిన్నట్లే భావించవచ్చు.