ఈ సారి జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ పోలింగ్ పండుగ లో పాల్గొనడానికి ఎన్నడూ లేని విధంగా హైద్రాబాద్, బెంగుళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి వివిధ ప్రాంతాల నుండి లక్షల సంఖ్యలో తమ తమ సొంతూరికి తరలి వస్తున్నారు ఓటర్లు. హైద్రాబాద్, విజయవాడ మధ్య రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
వివిధ ప్రాంతాల నుండి ఏపీ వచ్చే సరిహద్దు రహదారులన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్లలలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే వారికి తగ్గ ట్రాన్స్ ఫోర్ట్ సదుపాయాలు అందచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇలా తమ ఓటు హక్కు విలువ తెలుసుకుని అది తమ బాధ్యతగా భావించి ఇబ్బందులను అధిగమనించి మరి సుధీర తీరాలా నుండి సొంత రాష్ట్రానికి రావడం అంటే నిజంగా అటువంటి వారిని చూసి గర్వపడాల్సిందే. అయితే ఓటు హక్కు కోసం రాష్ట్రానికి వస్తున్న లక్షలాది మంది చూసి ఒక పక్క గర్వపడిన మరో పక్క సిగ్గుపడాల్సిందే.
ఎందుకంటే సొంత రాష్ట్రంలో ఉపాధి లేక ఉన్న ఊరిని, కన్న తల్లితండ్రులను, విడిచిపెట్టి మరో ప్రాంతానికి వలస వెళ్లడమంటే అది ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టుగానే భావించాలి. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక, తమ చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు కనిపించక కొందరు వలస బాట పడుతుంటే, మరికొంతమంది తమ చదువుకి అవసరమైన మెరుగైన విద్యా సంస్థలు అందుబాటులో లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు.
ఇంకెన్నాళ్లు ఇలా చదువుల కోసం, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం పుట్టిన నేలను విడిచి పారిపోవాలి..? రాజకీయ నాయకుల వారసులు మాత్రం వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తమ సొంత ప్రాంతంలోనే రాజకీయ ఉద్యోగులుగా మారుతుంటే వారికీ ఓటేస్తున్న ఏపీ వాసులు మాత్రం తమ్ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాల పై ఆధారపడుతున్నారు.
సొంత వారి ఆప్యాయతకు దూరమై వారు పడుతున్న ఆవేదనకు బాధ్యత ఎవరిదీ. తమకు ఓటేస్తున్న ప్రజలకు కనీసం ఉపాధి అవకాశాలు కల్పించకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే సరిపోతుందా..? ప్రభుత్వాలు నెలకొకసారి, ఏడాదికొకసారి బటన్ నొక్కి చేతులు దులుపుకుంటే భావితరం భవిష్యత్తు పక్క రాష్ట్రాలలో సమాధి కావాల్సిందేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నికల వేల ఇంతపెద్ద సంఖ్యలో ఓటర్లు బయట ప్రాంతాల నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత రాష్ట్రానికి వచ్చిన ఆనవాళ్లు లేవు. కానీ ఏపీ లో మాత్రం ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీనికి అన్ని ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే. అందుకే తమ దగ్గరున్న ఓటు అనే ఆయుధంతో భవిష్యత్తు తరం బాగు కోసం ఈ తరం వారు నడుంబిగించి ఓటేయడానికి ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామమనే చెప్పాలి.




