హోదా అడిగితే ఎమ్మెల్యే పదవి ఊడగొడతానంటావేమిటీ అయ్యా!

Ayyannapatrudu Warning to Jagan Mohan Reddy

మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా లభించలేదు. కనుక ఆయన కూడా వైసీపీలో మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల్లా ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఒకవేళ ఆ ఎమ్మెల్యే పదవి కూడా పోతే?

రాజ్యాంగంలో ఆర్టికల్ 190 (4) ప్రకారం స్పీకర్‌ నుంచి లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోకుండా 60 రోజులు కంటే ఎక్కువ రోజులు శాసనసభకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని డెప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు ఇదివరకే జగన్‌ని హెచ్చరించారు.

ADVERTISEMENT

తాజాగా స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు కూడా అదే చెప్పారు. కనుక ఇప్పటికైనా జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతున్న శాసనసభ బడ్జెట్‌లో సమావేశాలకు తప్పకుండా హాజరవ్వాలని లేకుంటే వారి సభ్యత్వాలు రద్దు చేసేందుకు తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రశ్నిస్తుంటే, మేము ఆ వివరాలు తెలుసుకొని శాసనసభలో వాటికి సమాధానాలు చెప్పాలా? మేము శాసనసభలో చర్చించిన అంశాలపై ఆయన తాడేపల్లి ప్యాలస్‌ కూర్చొని విమర్శిస్తుంటారా?

వైసీపీకి 18 మంది ఎమ్మెల్యేలు లేరు కనుక ఆయనకి ప్రతిపక్షనేత హోదా లభించదని ఆనాడే చెప్పేశాము. కానీ ఆయనే హైకోర్టుకి వెళ్ళి నవ్వులపాలయ్యారు. ఈ కేసు గురించి తెలియజేస్తూ హైకోర్టు నా పీఏకి ఓ లేఖ పంపింది తప్ప నాకు ఎటువంటి నోటీస్ పంపలేదు. కానీ నాకు హైకోర్టు సమన్లు పంపిందంటూ జగన్‌ మాట్లాడారు.

ఓ మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా, ఎమ్మెల్యేగా ఇలాగేనా వ్యవహరించేది? ఇకపై శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోతే ఆయన సీటు ఖాళీ అయ్యిందని ప్రకటించాల్సి వస్తుంది,” అని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

జగన్‌ ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా కావాలని లేకుంటే శాసనసభకు రానని చంటి పిల్లాడిలా మారాం చేస్తుంటే, హోదా గీదా లేదూ .. రాకపోతే ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుందని అయ్యన్న పాత్రుడు చెప్పడం చూస్తే అన్నంత పనీ చేసేలా ఉన్నారు.

కానీ శాసనసభలో స్పీకర్‌, డెప్యూటీ స్పీకర్‌, ముఖ్యమంత్రి స్థానాలలో వారిని చూడటం జగన్‌కి కష్టమే. పైగా వారిని గౌరవించడానికి అహం అడ్డొస్తుంది.

కానీ శాసనసభకు రాకపోతే ఎమ్మెల్యే పదవి ఊడిపోతుందని చెపుతున్నారు కనుక ఈసారి జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి అటెండన్స్ వేసుకొని వెళ్ళిపోతారేమో?

ADVERTISEMENT
Latest Stories