జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలన్నీ ఓ లెక్క అనుకుంటే, అవినీతి, అక్రమాలు మరో లెక్క అనుకోవచ్చు. కనుక వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటొకటిగా వెలికితీసి ప్రజల ముందుంచుతూ చర్యలు చేపడుతోంది. జగన్ హయాంలో జరిగిన వీటన్నిటితో పాటు, పెద్ద ఎత్తున వ్యవస్థల విధ్వంసం జరిగింది. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న కాకినాడ పోర్టు ఇందుకు తాజా నిదర్శనంగా కనిపిస్తోంది.
వీటన్నిటినీ చక్కదిద్ది మళ్ళీ గాడిలో పెట్టడమే పెద్ద పనిగా మారిందని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారంటే ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో అర్దం చేసుకోవచ్చు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
ఓ పక్క వాటన్నిటినీ సరిచేసుకుంటూ మరోపక్క అవినీతిపరులను వలవేసి పట్టుకొని వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఓ విషయం చెప్పుకోవాలి. కేసీఆర్ హయాంలో అభివృద్ధి పేరిట జరిగిన లక్షల కోట్ల అవినీతిని తవ్వి తీయడం మొదలుపెట్టాక దాని అంతు చిక్కడం లేదని, ప్రతీ వ్యవహారంలో అనేకమంది అవినీతి అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల పేర్లు బయటపడుతూనే ఉన్నాయని అన్నారు.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మొదలుపెడితే ప్రభుత్వం, పాలన పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందన్నారు. కనుక అవినీతిపరుల గురించి ప్రభుత్వానికి తెలిసి ఉన్నా వారిపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోలేని నిసహాయ పరిస్థితి నెలకొని ఉందని సాక్షాత్ సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగితే, ఏపీలో అసలు ఏ అభివృద్ధి లేకుండానే జగన్, వైసీపీ నేతల కనీసం అవినీతికి పాల్పడటం విశేషం.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
కూటమి ప్రభుత్వం కూడా బహుశః చేతులు కట్టేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణగా జగన్-అదానీ వ్యవహారం కళ్ళెదుటే ఉంది. అదానీ నుంచి జగన్ రూ.1,750 కోట్లు ముడుపులు తీసుకున్నారని టీడీపీ నేతలే చెపుతున్నారు. కానీ అదానీ-జగన్ ఇద్దరినీ ప్రభుత్వం టచ్ చేయలేకపోతోంది. కారణం అందరికీ తెలుసు. కానీ వారి తప్పులు లేదా అవినీతి కారణంగా రాష్ట్ర ప్రజలు రాబోయే రెండేళ్ళ పాటు కరెంట్ చార్జీల అదనపు భారం భరించాల్సి వస్తుండటం మరో విడ్డూరమే కదా?
అలాగే ఋషికొండపై జగన్ రూ.500 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం ‘వైట్ హౌస్’ని తలదన్నేలా విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకుంటే, కూటమి ప్రభుత్వం జగన్, ఆయనకు సహకరించిన అధికారులపై నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతోంది.
కాకినాడ పోర్టు వ్యవహారంలో చాలా మంది పెద్దలున్నారని అంటున్నారు కనుక ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం చేతులు కట్టేసుకోక తప్పదేమో?అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు జరిగి ఉండొచ్చు. కానీ ఆయన అధికారంలో నుంచి దిగిపోయినా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేక చిన్న చిన్న చేపలను పట్టుకొని ప్రజలకు చూపిస్తూ అవినీతిని అంతం చేస్తున్నామంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?
ఇదెలా ఉందంటే జగన్-దశలవారీగా మధ్యనిషేధంలాగే ఉందనిపిస్తుంది. సర్వశక్తివంతమైన ప్రభుత్వాలని కూడా నిసహాయంగా మార్చగలగడం మామూలు విషయమేమీ కాదు కదా?