బీజేపీ కి కావాల్సిన కార్యాలు రాష్ట్ర అధికార పార్టీలే చేసి పెడుతున్నాయా…?

Are ruling parties of state doing work required by BJPప్రస్తుతం దేశంలో బీజేపీ అశ్వమేధ యాగం చేస్తున్న తీరుగా ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ముందుకువెళ్తుంది. అయితే బీజేపీ ఆ యాగం పూర్తి చేయడానికి రహదారిని మాత్రం ఆరాష్ట్ర అధికార పార్టీలే వేయడం ఇందులో కొసమెరుపు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.

రాష్ట్రాలలో అధికారం దక్కించుకున్న ప్రాంతీయ పార్టీలు పదవిలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాల్సింది మాని ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే పనిలో మునిగితేలుతున్నారు. తద్వారా కొంతకాలం మానసిక ఆనందాన్ని పొందుతున్న ప్రాంతీయ పార్టీలు కాలం గడిచేకొద్దీ ప్రతిపక్షాలను ముంచుతూ తాము మునిగిపోతున్నాం అనే సంగతి తెలుసుకోలేకపోతున్నారు.

ADVERTISEMENT

తీరా విషయం అవగతం అయ్యే సరికి ప్రతిపక్షంలో కి బీజేపీ వచ్చి కూర్చుంటుంది. రాష్ట్రంలో రెండో స్థానానికి బీజేపీ చేరితే ఆ రాష్ట్రంలో జరిగేదేమిటో ప్రస్తుత రాజకీయాలను నిశితంగా చూస్తున్న ఎవరికైనా అర్ధమవ్వాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తెరాస తమ చిరకాల స్వప్నం నెరవేరింది అన్న అనందం కన్నా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతోనే తమ కార్యక్రమాలను నిర్వహించింది.

తెలంగాణ వ్యతిరేక పార్టీగా తెలుగుదేశం పార్టీ పై ముద్ర వేసి..,ముందుగా రాష్ట్రంలో టీడీపీని కనుమరుగుచేసారు. తరువాత తన దృష్టిని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పై కేంద్రకరించి ఆ పార్టీని పాతాళంలోకి నెట్టారు. ఇవే కారణాలు బీజేపీకి తెలంగాణాలో అవకాశాన్ని కలిపించి చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన కవిత ఓటమికి స్వయంగా బాటలు వేసుకున్నారు తెరాస పెద్దలు.

ఇంతకీ ఈ కార్యక్రమంలో బీజేపీకి లైన్ క్లియర్ చేసింది ఎవరంటే అధికార తెరాస పార్టీయే. అంటే ఒక ప్రతిపక్షాన్ని చంపి మరో ప్రతిపక్షానికి ఉపిరిపోసి ప్రస్తుతం తానూ వెంటిలేటర్ మీద ఉండే పరిస్థితులను తెచ్చుకుని.., కేసీఆర్ ఇప్పుడు గగ్గోలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలన్నింటిని సమూలంగా అంతమొందించి కొంత కాలం ఏకఛత్రాధిపత్యం అనుభవించిన కేసీఆర్ ఇప్పుడు కనీసం రాష్ట్రంలో బీజేపీ పార్టీ పేరుకూడా గట్టిగా వినిపించని పరిస్థితి నుంచి తెరాస కు ప్రత్యామ్నాయం బీజేపీ యే అనే స్తాయికి బీజేపీని తీసుకువచ్చారు.

అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ కక్ష్య పూరిత రాజకీయాల ద్వారా ప్రస్తుత ప్రతిపక్షాలను బయపెట్టో .., బెదిరించో రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడానికి అడుగులు వేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగిస్తే ఇప్పుడు కెసీఆర్ ఎదుర్కుంటున్న పరిస్థితులే రేపు జగన్ కూడా చవిచూడాల్సి వస్తుందనేది గతానుభవాల సారాంశం.

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ కూడా ఇదే పొరపాటు చేసి చివరికి తన ఓటమి కి తానే కారణమయ్యింది. ఒకప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కమ్యూనిస్టులను.., కాంగ్రెస్ పార్టీని., ఆయా నేతలను అణచివేయడంతో ఆ స్థానంలోకి బీజేపీ వచ్చి కూర్చుని స్వయానా ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా మమతనే ఓడించే స్థాయికి బీజేపీ ని తీసుకువచ్చింది కూడా ఆ రాష్ట్ర అధికార పార్టీనే.

అలాగే ప్రస్తుతం బీహార్ లో కూడా పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీకి మిత్ర పక్షంగా బీహార్లో అడుగుపెట్టిన బీజేపీ ఇప్పుడు అధికార పార్టీ పీఠంపైనే కన్నేసింది. ఆరాష్ట్ర అశ్వమేధ యాగంలో బీజేపీ తన విజయబావుట ఎగరేస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

రాజకీయనాయకుల మోనోపోలీ విధానమే ఇటువంటు వికృత క్రీడలకు ఊతమిచ్చే అవకాశాలుగా మారతాయి. రాష్ట్రంలో అయినా.., దేశంలో అయినా అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజా జీవనానికి..,ఆ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ప్రతిపక్ష బలమే రాజ్యంగ స్ఫూర్తికి ఆక్సిజన్ లాంటిది.

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి పాలక పక్షం అందలం ఎక్కుదాం అనుకుంటే రెండు స్థానాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం మూడువందల స్థానాలకు పైబడి తమ విజయపరంపరను కొనసాగించలేదనే సత్యాన్ని ఆపార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీలు ప్రజలనుండి పొందిన అధికారం వలన ఆయా పార్టీల నేతలు ప్రజల పట్ల బాధ్యతను., ప్రతిపక్షాల పట్ల గౌరవాన్ని కనపరిచేలా ఉన్నప్పుడే ఇటువంటి రాజకీయ క్రీడలకు నేతలు.,పార్టీలు బలికాకుండా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories