నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది కనుక నేడు బీఏసీ సమావేశంలో అదే ఖరారు చేయవచ్చు.
ఈసారి సమావేశాలలో మళ్ళీ మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెడతామని మంత్రులు చెపుతున్నందున, దానిని గట్టిగా వ్యతిరేకించాలని నిన్న సాయంత్రం జరిగిన టిడిపి శాసనసభాపక్షం సమావేశంలో నిర్ణయించారు. ఒకవేళ వైసీపీ మూడు రాజధానుల ఏర్పాటుకే కట్టుబడి ఉంటే శాసనసభని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకి వెళ్ళి ప్రజామోదం పొంది ఏర్పాటుచేయాలని టిడిపి సభ్యులు సవాలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిరుద్యోగం, అక్రమ మైనింగ్, పంచాయతీ నిధుల మళ్లింపు తదితర 20 అంశాలపై చర్చకు పట్టు పట్టాలని టిడిపి శాసనసభాపక్షం నిర్ణయించింది. వాటికి వైసీపీ ఎలాగూ అంగీకరించదు కనుక ఈ సమావేశాలలో అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్ర వాదోపవాదాలు జరగవచ్చు.
Also Read – అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి వెళ్ళలేదు!
అమరావతిని రాజధానిగా చేయాలని కోరుతూ రైతులు గత ఏడాది తిరుపతి వరకు మహాపాదయాత్ర చేసినప్పుడు దారిపొడవునా ప్రజలు నీరాజనాలు పలుకుతూ మద్దతు తెలిపారు. ఇప్పుడు అరసవిల్లి వరకు మహా పాదయాత్ర చేస్తున్నప్పుడూ దారిపొడవునా ప్రజలు వారికి స్వాగతం పలుకుతూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో రైతుల పాదయాత్ర ముగిసేసరికి ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలు కూడా ఏమనుకొంటున్నారో స్పష్టమవుతుంది. అప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన అర్దరహితమని, దానికి కర్నూలు, విశాఖ జిల్లాలతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
మరో పక్క కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతినే రాజధానిగా గుర్తిస్తోంది. ఈనెల 27న ఢిల్లీలో జరుగబోయే విభజన అంశాలపై సమావేశంలో రాజధాని నిర్మాణం, రైల్ కనెక్టివిటీ అంశాలపై చర్చించబోతున్నట్లు కేంద్ర హోంశాఖ లేఖలో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం.
Also Read – బిఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడే బ్రతికించాలా?
ఇటు రాష్ట్ర ప్రజలు, అటు కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంటే ఆ ప్రతిపాదనను అమలుచేయడం జగన్ ప్రభుత్వానికి కష్టంగా మారుతుంది. బహుశః అందుకే వైసీపీ ప్రభుత్వం హడావుడిగా అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టేందుకు సిద్దం అవుతున్నట్లు అర్దమవుతోంది. వైసీపీకి ఉభయసభలలో బలం ఉన్నందున మూడు రాజధానుల బిల్లుకి ఆమోదముద్ర వేసుకోవచ్చు.
ఢిల్లీలో సమావేశానికి హాజరయ్యే ముందుగానే ఈ బిల్లుని ఆమోదించుకొంటే, రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు చెప్పి ఉంది కనుక అమరావతిని రాజధానిగా చేయాలని పట్టుబట్టలేదని వైసీపీ భావిస్తుండవచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వానికి నిజంగా అంత శక్తి సామర్ధ్యాలే ఉండి ఉంటే ఈ మూడేళ్ళలోనే మూడు రాజధానులు ఏర్పాటుచేయగలిగేది కానీ చేయలేకపోయింది?
Also Read – రజని తో రాజీ…జరిగే పనేనా.?
కనుక శాసనసభలో దాని కోసం మరో వంద బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదముద్రలు గుద్దుకొన్నా మూడు రాజధానులు కాగితాలకే పరిమితం అవుతుంది. ఎందుకంటే వాటికి ప్రజల ఆమోదం లేదు కనుక. ఒకవేళ ప్రజామోదం కావాలనుకొంటే తక్షణం శాసనసభను రద్దు చేసి అదే అంశంతో ముందస్తు ఎన్నికలకి వెళ్ళమని టిడిపి సూచిస్తోంది. ఎన్నికలలో ప్రజామోదం పొందగలిగితే ఇక వైసీపీని మూడు రాజధానులను ఎవరూ అడ్డుకోలేరు… ఎవరూ వేలెత్తి చూపలేరు కదా?
రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానులే కోరుకొంటున్నారని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నప్పుడు మరిక ఆలస్యమెందుకు? శాసనసభను రద్దు చేసి ప్రజామోదం పొందవచ్చు కదా?