ఏటిఎంలో నగదు తీసుకున్నప్పుడు కొంత తక్కువ వస్తే? ఏం చేయాలి? అంటే వెంటనే బ్యాంకుకి తెలియజేయాలని ఎవరైనా చెప్తారు. కానీ తెలియజేసినా బ్యాంక్ స్పందించకపోతే?ఆర్‌బీఐకి పిర్యాదు చేయాలి. ఆర్‌బీఐ కూడా స్పందించకపోతే?న్యాయపోరాటం చేయాలి. కానీ ఎంతమంది చేస్తారు?చేయగలరు?
గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నగరంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఓ ఖాతాదారుడు 2017, ఫిభ్రవరి 18న నగరంలోని స్టేట్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటిఎం నుంచి రూ.10,000 నగదు తీసుకునేందుకు ప్రయత్నించాడు. రాలేదు కానీ మూడు నెలల తర్వాత అతని ఖాతాలో నుంచి రూ.10,000 నగదు విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది.
అప్పటి నుంచి అతను బ్యాంకు అడిగిన వివరాలన్నీ పంపిస్తూనే ఉన్నాడు. తన డబ్బు వాపసు చేయమని కోరుతూ డజన్ల కొద్దీ ఈ మెయిల్స్ పంపాడు. బ్యాంక్ స్పందించకపోవడంతో ఆర్‌బీఐకి, అదీ స్పందించకపోవడంతో కోర్టుకి వెళ్లి న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నాడు.
దాదాపు పదేళ్ళ న్యాయపోరాటం తర్వాత కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. రూ.10,000 నగదుతో పాటు, ఈ పదేళ్ళకి 9 శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇన్నేళ్ళు (3,288 రోజులు) జాప్యం చేసినందుకుగాను జరిమానాగా రోజుకి వంద రూపాయల చొప్పున రూ. 3,28,800 చెల్లించాలని ఆదేశించింది. దాంతో పాటు మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.3,000, కోర్టు ఖర్చులకు మరో 2,000 చెల్లించాలని సూరత్ కోర్టు తీర్పు చెప్పింది.
ఈ తీర్పు సదరు బ్యాంకుతో సహా ఖాతాదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రతీ బ్యాంకుకి చెంప దెబ్బ వంటిదే అని చెప్పక తప్పదు. కానీ లక్ష మందిలో ఏ ఒక్కడో ఇలా పోరాడగలరు. మిగిలినవారు నాలుగు రోజులు తిరిగి ఆశ వదిలేసుకుంటారు.
ఈ ధీమాతోనే బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ కేసు కూడా అలాగే మద్యలో ముగుస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకుని ఉండవచ్చు. లేదా తప్పు జరిగిందని ఒప్పుకుంటే తమ బ్యాంకుకి తీరని అప్రదిష్ట అని భావించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా వచ్చింది కదా? దీంతో బ్యాంక్ ప్రదిష్ట ఇంకా ఎక్కువ దెబ్బ తింది కదా? జస్ట్ రూ.10,000 చెల్లిస్తే సరిపోయేదానికి సుమారు రూ.3.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది కదా?




