ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆస్ట్రేలియా, ఇటీవల ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ తిని తీవ్ర భంగపాటుకు గురయ్యింది. కానీ దీనిని మరిచిపోయే విధంగా పాకిస్తాన్ – జింబాబ్వే – ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా రాణిస్తోంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన టీ20లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి, ఏకంగా 229 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది.
ఇందులో కూడా ప్రధాన భాగం ఒకే ఒక్క బ్యాట్స్ మెన్ ఆరోన్ ఫించ్ (76 బంతుల్లో 10 సిక్సర్లు, 16 ఫోర్లతో 172 పరుగులు) చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. టీ 20లలో ఒక జట్టు ఇంత స్కోర్ చేయడమే ఎక్కువ కాగా, ఫించ్ ఒక్కడే అంత భారీ స్కోర్ ను సాధించి పసికూనలపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్ కు ఏకంగా 223 పరుగులు జోడించి, మరో 4 బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందన్న తరుణంలో తొలి వికెట్ ను కోల్పోయారు.
అలాగే వరల్డ్ రికార్డ్ కొల్లగొట్టిన ఆరోన్ ఫించ్ కూడా మరో 2 బంతుల్లో ఆసీస్ ఇన్నింగ్స్ ముగుస్తుందనుకున్న తరుణంలో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. టీ20 150 ప్లస్ స్కోర్లను రెండు సార్లు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా ఫించ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. భారీ లక్ష్య చేధనలో కేవలం 129 పరుగులకే జింబాబ్వే కుప్పకూలడంతో 100 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ఘనవిజయం సాధించింది.



