ప్రజల ఆకాంక్ష… కాశీ, అయోధ్య, విగ్రహాలు మాత్రమే కాదుగా?

Ayodhya Ram Mandir Vijayawada Ambedkar Statue

దేశాన్ని, రాష్ట్రాలను ఏలే పాలకులు తమ ఆకాంక్షలను గుర్తించి తదనుగుణంగా పాలన సాగించాలని ప్రజలు కోరుకుంటారు. ఓట్లు వేసి గెలిపించి, అంతులేని అధికారం కట్టబెట్టినందుకు ప్రజలు ఆమాత్రం కోరుకోవడం అత్యాశ కాబోదు.

శ్రీరాముడు నడయాడిన పరమ పవిత్రమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని కోట్లాది హిందువుల ఆకాంక్షని మోడీ ప్రభుత్వం నెరవేర్చింది.

ADVERTISEMENT

అలాగే కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రాన్ని కూడా మోడీ ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేసింది. కనుక ఈ విషయంలో హిందువులు సంతృప్తి చెందిన్నట్లే భావించవచ్చు.

ఇందుకు ప్రతిగా వారందరూ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీకే ఓట్లు వేయాలని బీజేపీ ఆశించడం అత్యాశ కాబోదు. కనుక త్వరలో జరుగబోయే ఎన్నికలలో బీజేపీ ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఓట్లు కోరవచ్చు.

అయితే దేశంలో 140 కోట్లకు పైగా జనాభాలో వివిద మతస్తులు, ముఖ్యంగా కోట్లాది మంది పేదవారు కూడా ఉన్నారు. అలాగే హిందూ జనాభాతో సహా వారందరూ కేవలం కాశీ, అయోధ్య తదితర ఆలయాలను అభివృద్ధి చేస్తేచాలని అనుకోవడం లేదు.

వాటితో పాటు పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, మౌలిక వసతులపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. కోట్లాదిమంది మద్యతరగతి, దిగువ మద్య తరగతి ప్రజలు, నిరుపేదలు కూడు, గుడ్డ, వసతి వంటి కనీసం అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నారు.

గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ ప్రభుత్వం వీటన్నిటి కోసం చాలా గట్టిగానే ప్రయత్నిస్తోంది కూడా. అయితే నానాటికీ పెరిగిపోతున్న దేశ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగకపోవడం వలన దేశంలో ఇంకా కోట్లాది ప్రజలు కనీస అవసరాలు తీరక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఈవిషయం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బాగా తెలుసు. కానీ వారి అవసరాలను తీర్చడం కంటే వారిని ఏదో విధంగా ప్రసన్నం చేసుకొని ఓట్లు సంపాదించుకోవడమే ముఖ్యమని భావిస్తుంటాయి. అందుకు సులువైన మార్గమే సంక్షేమ పధకాలు, ఆలయాలు, మసీదులు, ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటం అని చెప్పక తప్పదు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం ఇటువంటి ప్రయత్నాలు చేయడం సర్వసాధారణమే. అయితే ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక అభివృద్ధిపై దృష్టి పెట్టి ఆ దిశలో కృషి చేయకపోవడం వలన ప్రజల కనీస అవసరాలు తీరక వారిలో అసంతృప్తి పెరుగుతూనే ఉంటుంది.

కానీ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసినా ప్రజలను సంతృప్తి పరచడం కష్టమని తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కనుక అంత శ్రమించే బదులు సంక్షేమ పధకాలతో, ఎత్తైన విగ్రహాలతో ప్రజలకు మేలు జరుగుతుందని వాదిస్తూ భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో రాజకీయాలు, అభివృద్ధి ఎన్నటికీ ఇదే విదంగా, ఇదే నిష్పత్తిలో సాగుతుంటాయి. కనుక ప్రజల అసంతృప్తి కూడా ఇదే నిష్పత్తిలో పెరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories