ఇవాళ్ళ ఓ మహానటి బి సరోజాదేవి కానరాని అనంతలోకాలకు తరలిపోగా, ఈరోజే అంతరిక్షం నుంచి భువికి దిగివచ్చారు శుభాంసు శుక్లా బృందం.
సోమవారం ఉదయం బెంగళూరులో కన్నుమూసిన అలనాటి అందాల మేటి నటి సరోజాదేవి అంత్యక్రియలు ఈరోజు ఉదయం ఆమె స్వగ్రామంలో దశవారలో పూర్తయ్యాయి.
ఆమె కన్నడ నటి అయినప్పటికీ ఆమెను తెలుగు ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హేమాహేమీలతో పోటీపడి నటించిన శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీరశూర కర్ణ, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న వంటి సినిమాలు ఆమెని తెలుగువారు అక్కున చేర్చుకునేలా చేశాయి.
తెలుగులో ఆమె 25కి పైగా సినిమాలు చేశారు. వాటిలో దాదాపు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆమె తెలుగు సినిమాలో నటిస్తే ఆమెని అందరూ తెలుగమ్మాయి అనుకునేవారు.
తమిళంలో ఎమ్జీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్‌లతో నటిస్తే అచ్చమైన తమిళ అమ్మాయి అనుకునేవారు. కన్నడలో రాజ్ కుమార్‌తో చేసిన సినిమాలు సరేసరి.
ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాషలోకి పరకాయ ప్రవేశం చేసినట్లు నటించేవారు. అటువంటి మహానటి బి సరోజా దేవి కానరాని ఆనంతలోకాలకు వెళ్ళిపోయారు.
భారత్ అంతరిక్ష పరిశోధనలలో మరో మైలురాయిగా నిలుస్తుంది శుభాంసు శుక్లా బృందం అంతరిక్ష పర్యటన. వారి బృందం జూన్ 25న అమెరికాలోని నాసా స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కాన్-9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది.
శుభాంసు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు రకరకాల పరిశోధనలు చేసి విజయవంతంగా భూమికి తిరిగివచ్చింది.
అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 2.50 గంటలకు కాలిఫోర్నియా సమీపంలో సముద్ర జలాలలో వారి డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అయ్యింది.
ఈ 18 రోజులలో వారి బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ 288 సార్లు ప్రదక్షిణాలు చేసింది. ఈ 18 రోజులలోనే దానిలో వారు 76 లక్షల మైళ్ళు ప్రయాణించినట్లయింది.
అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడు శుభాంసు శుక్లా క్షేమంగా భూమికి తిరిగి చేరుకోవడం భారతీయులు అందరికీ చాలా సంతోషం, గర్వకారణమే కదా?




