బాహుబలి: ది బిగినింగ్’ అట్టర్ ఫ్లాప్ అయిందా? అన్న చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. ‘బాహుబలి : ది కన్ క్లూజన్’ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సినిమా నిర్మాత యార్లగడ్డ శోభు మాట్లాడుతూ… బాహుబలి- ది బిగినింగ్’ సినిమా విడుదలకు ముందు నేను పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టాం. కొత్త హద్దులను సృష్టించాం. కానీ, అంత మొత్తం తిరిగి రాబట్టుకోగలమా? అనే తీవ్ర ఒత్తడికి గురయ్యాను.
మేము 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే… రెండో భాగానికి ఇంకా చాలా ఎక్కువ ఖర్చైంది. తొలి భాగానికి పెట్టిన ఖర్చుతో పోల్చుకుంటే తమకు వచ్చింది చాలా తక్కువ. లాభాలు అందుకోలేదు. ఆ లోటును ‘బాహుబలి 2’ భర్తి చేస్తుందని భావిస్తున్నానని అన్నారు. దీంతో టాలీవుడ్ లో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. గతంలో ‘బాహుబలి’ సినిమా 600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సినీ విశ్లేషకులు పేర్కొన్న తెలిసిందే. దీంతో సౌతిండియా సినిమా భారీ విజయం సాధించిందని, భారతీయ సినీ పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టిందంటూ వార్తలు కూడా వెలువడ్డాయి.
ఆ తరువాత ‘బాహుబలి’ టీమ్ కార్యాలయం, నివాసాలపై ఐటీ దాడులు కూడా జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని నిర్మాత చెబుతుండడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొంపదీసి ‘బాహుబలి’ అట్టర్ ఫ్లాప్ కాలేదు కదా? అన్న అనుమానం రేపుతోంది. అయితే పన్నుల నుండి తప్పించుకునేందుకు నిర్మాతలు సహజంగా చేసే కామెంట్లు ఇవేనని, వచ్చినదంతా నిజంగా ఎవరూ చెప్పరని గతంలో చాలామంది సినీ ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.



