కన్నీటికి ‘కోటా’ లేదు…

Brahmannadam Emotional on Kota Srinivas Passing Away

చనిపోయేనాటికి ప్రతీ ఒక్కరూ నలుగురుని సంపాదించుకోవాలంటారు పెద్దలు. అంటే పాడి మోయడానికి కాదు.. మనం పోయామని నిజంగా బాధపడే ఆత్మీయులని దాని పరమార్ధం.

ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారని తెలియగానే వస్తున్నవారిని చూస్తున్నప్పుడు ఆయన ఆ నలుగురుని సంపాదించుకుని వెళ్ళిపోయారని అర్దమవుతుంది.

ADVERTISEMENT

సినీ పరిశ్రమలో ఎవరైనా చనిపోతే ఇండస్ట్రీలో వారి స్థాయిని బట్టే ప్రముఖులు వస్తుంటారు. కానీ కోటా శ్రీనివాసరావు చనిపోయారని వార్త వినగానే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, రానా, మురళీమోహన్ వంటి హేమాహేమీలు మొదలు చిన్న నటులు వరకు అందరూ తరలివచ్చారు.

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండే రాంగోపాల్ వర్మ కూడా ఆయనతో అనుబందం గుర్తుచేసుకుంటూ ‘అనగనగా ఒక రోజు’ సినిమా తీస్తున్నప్పుడు ఆయనతో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారంటే కోటా శ్రీనివాసరావు అందరి మనసులు ఎంతగా గెలుచుకున్నారో అర్దం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ ఆయనతో అనుబందం గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయనతో అనేక సినిమాలు చేసిన బాబు మోహన్, బ్రహ్మానందం అయితే మీడియా ఎదుటే కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చేశారు.

ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నాయకులు ఆయనని కడసారిగా చూసి నివాళులు అర్పించేందుకు తరలివచ్చారు. తెలంగాణ ఫిల్మోటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఆయనకు నివాళులు అర్పించారు.

కోట శ్రీనివాసరావు 750కి పైగా సినిమాలు చేశారు కానీ హీరో వేషాలు వేయలేదు. సినిమాలు తీయలేదు. దర్శకత్వం చేయలేదు. పిసినారిగా నటించారు కానీ నటనలో ఎన్నడూ పిసినారితనం చూపలేదు. అందుకే కోట్లమంది అభిమానాన్ని పొందగలిగారు.

తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి, నవ్వించిన కోటా శ్రీనివాసరావు అందరినీ ఏడ్పీస్తూ తన కోసం కన్నీళ్ళు కార్చుతున్న ఇంతమందిని వెనకేసుకొని వెళ్ళిపోయారు.

ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ తన కోసం ఇంతమంది కన్నీటితో వీడ్కోలు పలుకుతుండటమే ఆయన గెలుచుకున్న గొప్ప అవార్డు కదా?

ADVERTISEMENT
Latest Stories