చంద్రబాబుతో ములాఖత్ ముగిశాక మీడియా ముందుకు వచ్చిన లోకేష్ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న ఈ రాజకీయ వేధింపులకు త్వరలోనే మీకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది అంటూ అటు హద్దులు దాటి ప్రవర్తిస్తున్న అధికారులకు, వైసీపీ నాయకులకు గట్టి హెచ్చరికలే చేశారు.
పవన్ కూడా తన వారాహి యాత్రలో భాగంగా చేసిన పలు ప్రసంగాలలో ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం అటు వైసీపీ సీనియర్ నేతలలో భయాన్ని బయటపెట్టింది. ఒంగోలులో నిర్వహించిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే మన భవిష్యత్ ఏమిటో ఒక్కసారి నేతలు, కార్యకర్తలు కూడా ఆలోచించాలి అంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఓటమి భయానికి అద్దంపడుతోంది. చంద్రబాబు అరెస్టుతో ఇప్పటికే దెబ్బతిన్న వైసీపీ గ్రాఫ్ ఇప్పుడు టీడీపీ – జనసేన కూటమితో మరో అడుగు వెనక్కెలిందనే ఒప్పుకోవాలి.
బాబు పట్ల ప్రజలలో ఉన్న సానుభూతి ఓట్ల రూపంలో మారితే ‘బండ్లు ఓడలవ్వక’ తప్పని పరిస్థితి. అప్పుడు పరిస్థితులు ఇంతకు పదింతలు ఉంటాయని ఇప్పటికే పలు సార్లు లోకేష్ హెచ్చరించడం జరిగింది. వీటన్నిటిని బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? అందుకే అందరు కలిసికట్టుగా శ్రమించి రానున్న ఎన్నికలలో జగన్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించిన వారికి తమ మద్దతు తెలిపి ఆ నాయకుల గెలుపుకి కృషి చేయాలంటూ కార్యకర్తలకు హితవు పలికారు.
పరిస్థితి చూస్తుంటే ఈ భయం ఒక్క బాలినేనిలో మాత్రమే కాదు వైసీపీలో మరికొందరి ఆలోచన కూడా ఇదే తరహాలో ఉందనే అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది.”వై ఏపీ నీడ్స్ జగన్”…,కాదు “వై వైసీపీ లీడర్లు నీడ్స్ జగన్” అన్నట్లుగా కార్యక్రమాన్ని మార్చుకోవాలి అంటూ టీడీపీ నేతలు తమ ప్రత్యర్థికి సూచనలు చేస్తున్నారు .వైసీపీ అధినేత జగన్ కూడా బయటకు ‘మేకపోతు గాంభీర్యాన్ని’ ప్రదర్శిస్తున్నారు కానీ ఆయన ఇన్నర్ ఫీలింగ్ కూడా ఇదే అంటూ తెలుగు తమ్ముళ్లు సెటైర్లతో సమాధానం ఇస్తున్నారు.
జగన్ తిరిగి అధికారంలోకి రాకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమి ఉండదు మరో నేత ముఖ్యమంత్రి అవుతారు. అంతే కానీ జగన్ అధికారంలోకి రాకపోతే వైసీపీ నాయకులకు భవిష్యత్ ఉండదు కాబట్టే “వై వైసీపీ లీడర్లు నీడ్స్ జగన్” అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
రానున్న ఎన్నికలలో జగన్ ముఖ్యమంత్రి కాకపోతే ఆయనకు పోయేది ఏమి ఉండదు. జగన్ తన పాత కేసులలో జైలుకి – బెయిలుకు మధ్య ఉగిసలాడుతూ ఉంటాడు. కానీ వైసీపీ నేతల పరిస్థితి అలాకాదు. ఇప్పుడు చేసిన ప్రతి అడ్డగోలు విమర్శలకు పర్యవసానాలు అప్పుడు అనుభవించవలసి వస్తుంది అనే ఆలోచనలో మరి కొంతమంది వైసీపీ నేతలు ఉన్నట్టు రాజకీయ వర్గాలలో చర్చ ఊపందుకుంది.



