ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ నేడో రేపో ఎన్నికలు జరుగబోతున్నట్లు అధికార పార్టీయే హడావుడి పడిపోతోంది. అలాగని ముందస్తు ఎన్నికలకు వెళుతోందా… అంటే లేదనే చెపుతోంది. మరి ఎందుకు ఇంత హడావుడి, కంగారూ, ఆందోళన అంటే అభద్రతాభావమే అని చెపొచ్చు.
ఏ అభివృద్ధి చేయకుండానే ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్: 1గా నిలుస్తోందని, యావత్ దేశానికే తమ పాలన ఆదర్శమని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటుంటే, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. పొరపాటున వారు ఎప్పుడైనా నోరు విప్పితే ఆంధ్రా ప్రజలు సిగ్గుతో తలదించుకోవలసివస్తోంది. కిందపడినా, వెనుకబడినా మేమే గెలిచామని చెప్పుకోవడం వైసీపీ నేతలకే చెల్లు.
ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీలో కొందరు తన సీటుకు ఎసరు పెడుతున్నారంటూ, ఇటీవల పార్టీపై తిరుగుబాటుకు సిద్దమై టిడిపి వైపు చూసిన సంగతి మరిచిపోయి ఇప్పుడు టిడిపిని విమర్శిస్తూ ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. “అధికారం కోల్పోయిన తర్వాత @ncbn కాదు ఆయన పార్టీ నాయకులకీ మతి భ్రమించినట్లుంది. ఏపీలో డెవలప్‌మెంట్ స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎల్లో మీడియా నెగటివ్‌గా రాయడం దానికి వీళ్లు వంతపాడటం సరిపోయింది. ఏపీలో టీడీపీ పరువు ఎప్పుడో పోయింది.. ఇప్పుడు ఢిల్లీలో పోయింది,” అంటూ ట్వీట్ చేశారు.
అయితే అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్లు ‘ఎల్లో మీడియా’ అని ముద్రవేసేసి చేతులు దులుపుకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. అయితే అంతమాత్రన్న ప్రతిపక్షాలు, మీడియా ఫోటోలు, సాక్ష్యాధారాలతో సహా చూపుతున్నవి అబద్దాలు అయిపోవు కదా?
ఉదాహరణకు విశాఖలో ఋషికొండ గురించి, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి, పోలవరం ప్రాజెక్టులో దెబ్బ తిన్న రీటెయినింగ్ వాల్ గురించి, ప్రతిపక్ష కార్యాలయాలపై దాడుల గురించి, ప్రతిపక్షా నేతలను, కార్యకర్తలను వేధించడం, హత్యలు, అత్యాచారాల గురించి, చివరికి వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రతిపక్షాలు, మీడియా అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ నేతలు స్ట్రెయిట్‌గా సమాధానాలు చెప్పలేకపోతున్నారు… ఎందుకు?
నారా లోకేష్ తన పాదయాత్రలో దారిపొడవునా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తవ్వేస్తున్న కొండలు, గుట్టల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అడిగినప్పుడు వాటికి సమాధానం చెప్పాలి కదా?కానీ ఎదురుదాడి చేసి సమాధానం చెప్పకుండా తప్పించుకొనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లు?అంటే ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ఆ ఆరోపణలు నిజమే కనుక.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంటుంది కానీ ఏపీలో అలా ఎక్కడైనా కనిపిస్తుందా?వైసీపీ నేతలు చూపించగలరా?అంటే లేదనే అందరికీ తెలుసు.
నెల్లూరు, గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యేలే అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్పుకొన్నారు కదా?మరి ప్రతిపక్షాలను మీడియాను ఎందుకు ఆడిపోసుకోవడం? అయినా ‘ఎల్లో మీడియా’ అని ముద్రవేసేస్తే పాప ప్రక్షాళన అయిపోదు. తమ సొంత మీడియాలో ‘ఎల్లో మీడియా’ కసితీరా రాసేసుకొంటే వాస్తవాలు మారిపోవని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిది.



