బనకచర్లకు టెండర్లు… టైమింగ్ వెరీ బ్యాడ్!

Andhra Pradesh Banakacharla Project tender controversy during Telangana elections

బనకచర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ… దానిని చూసి అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత రాద్దాంతం చేశాయో అందరూ చూశారు. అందువల్లే ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేసి తిప్పి పంపించేసింది.

కనుక బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ముందుకు సాగాలనుకోవడం చాలా మంచి ఆలోచనే.

ADVERTISEMENT

కనుక పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుని అనుసంధానం చేసేందుకు డీపీఆర్ (సమగ్ర నివేదిక) తయారు చేసి, దానికి కేంద్రం అనుమతులు కూడా సాధించేందుకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ టెండర్లు పిలిచింది. టెండర్లు దాఖలు చేసేందుకు ఈ నెల 22 వరకు గడువు పెట్టింది.

త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడినా దానిని బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికలలో అస్త్రంగా ఉపయోగించుకొని రాజకీయ లబ్ది పొందుతుంది.

కనుక ఇటువంటి సమయంలో ఏపీ ప్రభుత్వం పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం టెండర్లు పిలిస్తే బీఆర్ఎస్‌ పార్టీ చేతికి ఏకంగా వజ్రాయుధం అందించినట్లే అవుతుంది. ఇది ఆ పార్టీని గెలిపించడానికి సాయపడుతున్నట్లే అవుతుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రంలోనే కాకుండా ఏపీలో కూడా టీడీపిని కేసీఆర్‌ చావు దెబ్బ తీశారు. చంద్రబాబు నాయుడుకి రాజకీయ సమాధి చేయాలనుకున్నారు.

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్‌ ఎంత చులకనగా మాట్లాడారో అందరూ విన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా కేటీఆర్‌, హరీష్ రావు ఇద్దరూ తమ కంటే వయసులో, అనుభవంలో చాలా పెద్దవారైన సిఎం చంద్రబాబు నాయుడు గురించి చాలా చులకనగా మాట్లాడుతూనే ఉన్నారు.

ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు డిపీఆర్ కోసం టెండర్లు పిలవడం ద్వారా బీఆర్ఎస్‌ పార్టీకే మేలు కలుగుతున్నా మళ్ళీ వారిరువురూ సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించక మానరు.

కనుక తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్న ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుకి టెండర్లు పిలవడం చాలా రాంగ్ టైమింగ్ అనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories