తెలంగాణ బిజేపిలో ఓ సామాన్య కార్యకర్త స్థాయి నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్, ఇప్పుడు కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదవడంతో అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడటం చాలా బాధాకరం. కన్న తండ్రిగా ఆయన కొడుకుని వెనకేసుకు రావడం సహజమే.
కానీ ఓ ఎంపీగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన కొడుకు తప్పు చేశాడా లేదా? అనేది పోలీసులు, న్యాయస్థానం తేల్చుతాయని చెప్పి విచారణకు హాజరు పరిస్తే ఆయన గౌరవం మరింత పెరిగి ఉండేది. ముఖ్యంగా ప్రజలకు, పార్టీ పెద్దలకు అయన పట్ల గౌరవం మరింత పెరిగి ఉండేది. అది ఆయన రాజకీయ జీవితానికి ఉపయోగపడేది.
కానీ ఓ తండ్రిగా ఈ కేసు నుంచి కొడుకుని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రతీ చిన్న ప్రయత్నం అయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే బీఆర్ఎస్ పార్టీ వాదనలను బలపరుస్తున్నట్లే అవుతుంది. ఈ కేసుని రాజకీయరంగులద్ది మలుపు తిప్పాలని చేసే ప్రయత్నాలను అర్థం చేసుకోలేనంత అజ్ఞానులు కారు ప్రజలు. ఒకవేళ ప్రజలు పట్టించుకోకపోయినా, రాజకీయ ప్రత్యర్ధులు విడిచిపెట్టరని బీఆర్ఎస్ పార్టీ నిరూపిస్తోంది కదా?
పోక్సో కేసులో పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారని, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా న్యాయస్థానాలు ఇలాగే స్పందిస్తాయని, తెలిసి ఉన్నప్పుడు బండి సంజయ్ కొడుకుని ఎంతకాలం వెనకేసుకు రాగలరు? నేడు ఏదోవిధంగా కాపాడుకొని రేపు స్వయంగా పోలీసులకు అప్పగించి, జైలుకి సాగనంపాల్సివస్తే ఇంకా అవమానం కదా? అని ఆలోచించి చట్టాన్ని గౌరవిస్తే ఆయన గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందరూ హర్షించేవారు కూడా. ఆ తర్వాత కొడుకుని కాపాడుకోవడం కోసం ఎన్ని న్యాయపోరాటాలు చేసినా ఎవరూ తప్పు పట్టలేరు కదా?






