కేంద్రం వెల్లడించిన నిర్ణయం ప్రకారం, నేటి నుంచి సేవింగ్స్ ఖాతాలు సహా అన్ని రకాల బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్ డ్రాలపై ఆంక్షలన్నీ తొలగిపోయాయి. ఇక నుండి ఎంత డబ్బయినా బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ, అలా చేసుకునేందుకు ఏటీఎంల దగ్గరకు వెళితే మీకు ఆశాభంగం తప్పకపోవచ్చు. ఎందుకంటే… రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలో కేవలం 20 శాతమే పని చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఒక్క ఏటీఎంలో కాదు, బ్యాంకులలో విత్ డ్రాలు చేసుకుందామని బ్యాంకులకు వెళ్ళినా ‘నో క్యాష్’ బోర్డే తారసపడుతోంది. ఈ నేపథ్యంలో డబ్బు విత్ డ్రాకు అవకాశాలు ఉన్నా, ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియని వింత పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించిన తరువాత, నగదు కొరత సమస్య నుంచి బయటపడేందుకు తొలుత 2 వేలు, ఆపై 4,500, వారానికి 24 వేలు… ఇలా విత్ డ్రా పరిమితులను సడలిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు బ్యాంకులలో అమలు చేయాలని భావిస్తున్న సర్వీస్ ఛార్జీలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల సర్వీస్ చార్జీలు, లావాదేవీల పరిమితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ… బ్యాంకులకు బుద్ధి చెప్పాలని, ‘నో బ్యాంకింగ్ డే’ జరుపుదామని స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లకుంటే ఒక రోజు వడ్డీ ప్లస్ అవుతుందే తప్ప, నష్టం లేదని, ఖాతాల్లోని చివరి పైసాను కూడా తీసుకుని ఇంట్లో దాచుకోవాలని, ఆర్థిక సంవత్సరం చివర బ్యాలెన్స్ లు తగ్గితే, టార్గెట్లు పూర్తి కాక, బ్యాంకులు దారిలోకి వస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.



