ఆ ఇద్దరి నినాదం ఒక్కటే కానీ…

BC Politics Heat Up in Telangana Power Game

ఇన్నాళ్లుగా కుల ఆధారిత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న తెలంగాణ ఇక ఇప్పటి నుంచి కుల రాజకీయాల ఉచ్చులోకి వెళ్లనుందా.? అన్న ఈ ప్రశ్నే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను బీసీ సామజిక వర్గం వైపు చూసేలా చేస్తున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ గా పదవి దక్కించుకున్న తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయాలలో వేసిన ఈ కుల రాజకీయ పునాదులలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బిఆర్ఎస్ వరకు అలాగే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా చిక్కుకున్నాయి.

ADVERTISEMENT

బీసీ సామాజికవర్గాలకు రాజ్యాధికారం అందని ద్రాక్షేనా అంటూ తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉంటూనే బీసీ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి రాష్ట్రంలోని ఇతర సామజిక వర్గాల పై మోతాదుకు మించి విమర్శలు చేసారు.

దాని పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కారం వేటు ఎదుర్కొన్నారు. అలాగే ప్రత్యేకంగా బీసీ ల కోసమే తెలంగాణలో ఒక కొత్త పార్టీ ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

అయితే తెలంగాణ రాజకీయాలలో తీన్మార్ రాచేసిన కుల చిచ్చు పై రేవంత్ సర్కారు బీసీ రిజర్వేషన్ అంటూ నిప్పు అంటించింది. దానికి కొనసాగింపుగా ఇచ్చిన హామీకి కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సామాజికవర్గాలకు 42 % రిజర్వేషన్ అమలు అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు కేంద్రానికి పంపారు రేవంత్.

రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ కోర్టులో నుంచి మళ్లించి బీజేపీ కోర్టులో వేసి రాష్ట్ర బీజేపీ ని ఇరుకున పెట్టారు. అలాగే ఇక ఇటు బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన కవిత సైతం బీసీ సామజిక వర్గాల రాజకీయ హక్కులకై పోరాడేందుకు సిద్దమయ్యింది.

తన పోరాట ఫలితమే అధికార కాంగ్రెస్ బీసీలకు 42 % రిజర్వేషన్ ప్రకటన అంటూ క్రిడిట్ కోసం సామజిక తెలంగాణ అంటూ కొత్త రాజకీయం మొదలుపెట్టింది కవిత. ఇటు తీన్మార్ మల్లన్న అటు కవిత ఇద్దరు కూడా తమ సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ, సొంత పార్టీ అధిష్టానం నుంచే సస్పెన్షన్ ఎదుర్కొన్నారు.

అలాగే ఇక ఈ ఇద్దరు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుని తెలంగాణలో సామజిక నాయ్యం అంటూ ఒకరు, తెలంగాణలో బీసీల రాజ్యాధికారం అంటూ మరొకరు రాజకీయం ప్రారంభించడానికి సై అంటు తెరవెనుక తతంగాలు పూర్తి చేసే పనిలో పడ్డారు.

ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో బీసీ పార్టీ ప్రారభించబోతున్నట్టు తెలంగాణ రాజకీయాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే ఈ నెల 17 న పార్టీ విధివిధానాలు, పార్టీ జెండా ఆవిష్కరణ ఉండొచ్చు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అలాగే ఇటు కవిత సైతం బీసీ ల ప్రాధాన్యంగా తన సొంత కుంపటికి ప్రణాళికలు వేస్తున్నారని, కవిత కూడా మరోకొత్త పార్టీ ఆవిర్భావంతో తీన్మార్ బీసీ నినాదానికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారంటూ తెలంగాణ రాజకీయాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవితకు గుర్తుకు రాని ఈ బీసీ నినాదం, సామజిక తెలంగాణ అంశం ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి దూరం జరగగానే ఎందుకు గుర్తుకు వచ్చినట్టు అనే ప్రశ్న కవిత తొలి అడుగులోనే ఎదురవుతుంది.

అలాగే తీన్మార్ రాజకీయం వెనుక బిఆర్ఎస్ పాత్ర ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ సాధన తరువాత బీసీ నేతే రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అంటూ హామీ ఇచ్చి తప్పిన కేసీఆర్ పార్టీతో తీన్మార్ తెరచాటు రాజకీయమా అన్న ఆరోపణలకు తీన్మార్ బదులు చెప్పాల్సి ఉంటుంది.

ఇలా కల్వకుంట్ల కవిత – తీన్మార్ మల్లన్న రాజకీయ నినాదం ఒకటే అయినా దారులు మాత్రం వేరు వేరే. మరి ఈ దారులు కలవని నేతలు చేస్తున్న ఈ బీసీ రాజకీయం తెలంగాణలో తీన్మార్ కు రాజ్యాధికారం అందిస్తుందా.? కవితను బీసీ సంక్షేమ నేత గుర్తిస్తుందా.?

ADVERTISEMENT
Latest Stories