మహేష్ ఇలా నిరుత్సాహపరిచాడేంటి?

Mahesh-Babu-Bharat-Ane-Nenu-Interviewప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద “భరత్ అనే నేను” హవా కొనసాగుతోంది. ప్రిన్స్ కెరీర్ లోనే అత్యంత భారీ హిట్ గా నమోదైన ఈ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందోనని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇలా సూపర్ హిట్ వచ్చిన ప్రతిసారి ప్రిన్స్ విజయవాడను సందర్శించుకోవడం పరిపాటి. ఇది మొదటి సినిమా “రాజకుమారుడు” నుండి మహేష్ చాలా అలవాటుగా మారింది. మధ్యలో ‘అర్జున్’ వంటి యావరేజ్ సినిమాలకు ప్రిన్స్ ప్రత్యేకంగా విజయవాడ విచ్చేశారు.

దీనికి ఓ కారణం లేకపోలేదు. టాలీవుడ్ లో ఏ హీరోకు లేని విధంగా వరుసగా 22 సినిమాలు 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకున్న ట్రాక్ రికార్డ్ మహేష్ సొంతం. ఇప్పటివరకు ప్రిన్స్ కెరీర్ లో ‘స్పైడర్’ ఒక్కటే విజయవాడలో 50 రోజులు పడని చిత్రం. అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే, బ్లాక్ బస్టర్ వచ్చిన ప్రతిసారి విజయవాడలోని అభిమానులను కలుసుకుంటుంటారు. ‘ఒక్కడు, దూకుడు’ విజయోత్సవ వేడుకలు అయితే విజయవాడలోనే భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వైనం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే ‘భరత్ అనే నేను’ సినిమా సూపర్ హిట్ తర్వాత మహేష్ విజయవాడ విచ్చేయబోతున్నారన్న టాక్ వచ్చింది గానీ, అది ఎప్పుడు? ఏంటి? అన్న విషయం బయటకు రాలేదు. కానీ సడెన్ గా శుక్రవారం ఉదయం నాడు హైదరాబాద్ నుండి బయల్దేరి, విజయవాడ వచ్చిన ప్రిన్స్ కనకదుర్గమ్మను దర్శించుకుని అన్నపూర్ణలో ప్రదర్శితమవుతున్న “భరత్ అనే నేను”ను కాసేపు అభిమానులతో కలిసి చూసారు. ప్రిన్స్ రాకను ఊహించని విజయవాడ అభిమానగణం ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది.

అనుకోకుండా ఎలా వచ్చారో, అంతే త్వరగా మళ్ళీ విజయవాడ నుండి వెళ్ళిపోవడం అనేది ప్రిన్స్ అభిమానులను నిరుత్సాహపరిచింది. మహేష్ వచ్చింది పగలు సమయం కావడంతో, ఎక్కువ మందిని కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అదే సాయంత్రం వేళ అయితే మరింత మంది మహేష్ ను చూసే అవకాశం విజయవాడ జనులకు వచ్చి ఉండేది. విజయవాడ నుండి నేరుగా తిరుపతి పయనం అయిన ప్రిన్స్ అండ్ కో, అక్కడ స్వామి వారి దర్శనం చేసుకుని అభిమానులను కలవనున్నారు.

ADVERTISEMENT
Latest Stories