రాష్ట్ర విభజన, ఐదేళ్ళ జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చితికిపోయింది. మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదా? అని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందారు. కానీ దూరదృష్టి కలిగిన కార్యసాధకుడు చంద్రబాబు నాయుడు చేతికి పగ్గాలు అందించడంతో అయన ఆంధ్రప్రదేశ్‌ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు.
వెనుకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలు అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధాని తప్పనిసరి అని వైసీపీ వితండవాదం చేస్తూ కాలక్షేపం చేసి దిగిపోయింది. కానీ అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నా అటు అస్సాం నుంచి ఇటు గుజరాత్ వరకు, అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు అభివృద్ది చేయవచ్చని ప్రధాని మోడీ నిరూపించి చూపుతున్నారు.
అదేవిధంగా సిఎం చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చకాచకా నిర్మిస్తూనే, అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఇందుకు చక్కటి ఉదాహరణగా విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల మద్య భోగాపురం వద్ద నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కళ్ళెదుటే ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత చేతిలో చిల్లి గవ్వలేనప్పుడే అమరావతికి బీజం వేశారు. అప్పుడే భోగాపురం విమానాశ్రయానికి కూడా శ్రీకారం చుట్టారు. జగన్ రెంటినీ పక్కన పడేసినప్పటికీ చంద్రబాబు నాయుడు రాగానే మళ్ళీ రెంటినీ శరవేగంగా నిర్మింపజేస్తున్నారు.
ఇప్పటికే విమానాశ్రయం పనులు 75 శాతం పైగా పూర్తయ్యాయి. జనవరి 4న ఢిల్లీ నుంచి మొదటి విమానం భోగాపురంలో ల్యాండ్ అయ్యింది కూడా. తద్వారా విమానాల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టమైంది.
కనుక భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు ముహూర్తం పెట్టేశారు. కానీ ప్రధాని మోడీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలనుకుంటున్నారు. కనుక ఆయన వీలును బట్టి జూలై 5, ఆగస్ట్ 17, ఆగస్ట్ 19 తేదీలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంబించాలని సిఎం చంద్రబాబు నాయుడు పీఎంవోకి లేఖ వ్రాశారు.
తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు కావస్తున్నా కొత్తగా ఒక్క విమానాశ్రయం ఏర్పాటు కాలేదు. కానీ చంద్రబాబు నాయుడు మొదటిసారి సిఎం అయినప్పుడు కడప విమానాశ్రయం, రెండోసారి అయినప్పుడు భోగాపురం విమానాశ్రయం నిర్మించి అందుబాటులోకి తెస్తున్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళు పూర్తికాక ముందే భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తి చేయడం సిఎం చంద్రబాబు నాయుడు సమర్ధత, పనితనానికి గీటురాయే కదా?
రాష్ట్రాభివృద్ధి కోసం ఎక్కడికక్కడ రాజధానులు అవసరం లేదు. కేవలం చిత్తశుద్ధి ఉంటే చాలని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు కదా?




