జగన్ పై పంచ్ లు… సెటైర్లు… ఎటకారాలు..!

Bhuma Nagi Reddy Comments YS Jagan Over RajyaSabha Candidate రాజ్యసభ అభ్యర్ధి నేపధ్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేల తీరు గత రెండు రోజులుగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ ఎపిసోడ్ కు శుభంకార్డు పడిపోగా, గత రెండు రోజులుగా జరిగిందేమిటి అన్న దానిపై ప్రధాన నాయకులు జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలు వివరాలను తెలిపారు. అసలు చంద్రబాబు మమ్ములను పిలిచారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తామే 17 మంది సమావేశమై, ఒక రాజ్యసభ అభ్యర్ధిని బరిలో నిలపాలని చంద్రబాబును దాదాపు 7 గంటలు కోరామని, రాజకీయాలలో అయినప్పటికీ ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిందిగా సూచనలు చేయడంతో తామంతా విరమించుకున్నామని తెలిపారు.

ADVERTISEMENT

ఈ సందర్భంలో చంద్రబాబుకు, జగన్ కు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా మీడియాకు వివరించారు సదరు నేతలు. వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడిన రోజే రాజ్యసభ అభ్యర్ధి విజయసాయిరెడ్డి అన్న విషయాన్ని ఎవరితో సంప్రదించకుండా జగన్ మోహన్ రెడ్డి డిక్లేర్ చేసారని, అయితే మరోవైపు అసలు నిలపాలా వద్దా అన్న విషయాన్ని కూడా అందరితో సంప్రదింపులు జరిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని భూమా తెలిపారు. పదే పదే మమ్ములను అమ్ముడు పోయామంటూ తమ రాజకీయ లబ్ది కోసం ఆరోపణలు చేస్తుంటే బాధ కలుగుతోందని… మరి ఇదే జగన్ రాజ్యసభ సీటు కోసం తన ఎమ్మెల్యేలను దుబాయ్ వంటి దూర ప్రాంతాలను పంపించి ఏం చేస్తున్నారని… మీరు చేస్తే సంసారం… ఇతర వాళ్ళు చేస్తే వ్యభిచారం… అన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇంతవరకు కర్నూలు జిల్లాకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని గుర్తు చేసిన భూమా, ఈ సారి కర్నూల్ జిల్లాకు ప్రాధ్యాన్యత ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో అన్ని తానై వ్యవహరిస్తారని, అతను చెప్పిందే వేదవాక్కుగా అంతా భావించాలని, సీనియర్ నేతలతో అసలు చర్చించరని, జగన్ కు నోరు తెరిస్తే… సిఎం కుర్చీ, డబ్బు తప్ప మరొక అంశం తెలియదని హావభావాలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పచ్చ కామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుందన్నట్టు… డబ్బు యావ ఉన్న జగన్ కు అందరూ డబ్బులకు అమ్ముడు పోతారని భావిస్తున్నారని సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు చేసారు.

జగన్ విధానం గురించి ప్రతి సెకన్ ఖండించే వారమని, రాజశేఖర్ రెడ్డి గారి ముఖం చూసి అన్నాళ్ళు ఉండాల్సి వచ్చిందని, ఇలా చెప్పుకుంటూ పోతే రెండు గంటలైనా సరిపోదని, అదో పెద్ద భారతం అయిపోద్ది, తనకు ఎంత డబ్బులు సంపాదించినా… ఆ ఆశ తీరదు అంటూ జగన్ తీరును దుయ్యబట్టారు. తనతో పాటు తన ఫ్రెండ్ కొడుకు ఒకతను ఉండేవాడని, అతన్ని ఏం తిన్నావు అని అడిగితే… దోస అని అంటాడని, జగన్ క్కూడా అలాగే ఎప్పుడూ అడిగినా ‘సిఎం కుర్చీ’ అని తప్ప మరొకటి ఉండదని, ముఖ్యమంత్రి అయ్యి ఇంతకు పదింతలు సంపాదించాలన్న ఆశ తప్ప మరొకటి లేదని, ఈ ప్రపంచంలో 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పాలన చేస్తాము అని అనే వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అంటూ ఎటకారపు మాటలు వ్యాఖ్యానించారు.

పేపర్ ఉంది కదాయని ఏది పడితే అది రాసేస్తున్నారని, తండ్రిని పోగొట్టుకున్న చిన్న పిల్ల వాడు కదా అని సహకరిస్తే… మమ్మల్ని పురుగులను చూసినట్టు చూసేవాడని, జగన్ తీరు మారాలంటే మిగిలిన సమయం అంతా చంద్రబాబుతో కలిసి రావాలని, చంద్రబాబు చెప్పినట్టు వింటే గాని రాష్ట్రం బాగుపడదని, ఏ-1గా ఉన్న జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని కంకణం కట్టుకోగా, ఏ-2ని రాజ్యసభకు పంపిస్తున్నారని, ఆ కేసుల్లో ఉన్న ఏ-3, ఏ-4 మిగిలిన వారికి తర్వాత ప్రాధాన్యత దక్కుతుందేమోనని, బహుశా మేం అందులో లేము గనుక మాకు సరైన గౌరవం దక్కలేదేమో అంటూ ఆదినారాయణరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ADVERTISEMENT
Latest Stories