తుని విధ్వంసంలో భాగంగా గుంటూరులో సీఐడీ కార్యాలయంలో రెండు రోజులుగా వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తొలి రోజు అయిదు గంటలు ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టిన సీఐడీ పోలీసులు, రెండవ రోజు మరింత ఎక్కువ సమయం విచారణ చేసారు. అయితే సాయంత్ర సమయం గడిచే పాటికి సీఐడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులు మోహరించడంతో, భూమన అరెస్ట్ కావచ్చన్న సంకేతాలను మీడియా వర్గాలు ప్రసారం చేసాయి.
ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అంబటి రాంబాబు తదితరులు కార్యకర్తలతో కలిసి సీఐడీ కార్యాలయంకు చేరుకున్నారు. అంతేకాదు, దాదాపుగా భూమనను అరెస్ట్ చేస్తారు అన్న సంకేతాలను మీడియాల వేదికగా వెలిబుచ్చారు. ఈ అరెస్ట్ జరిగితే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయంటూ హెచ్చరికలు కూడా జారీ చేసారు. బహుశా ముందస్తు ప్రణాళికలు సిద్ధమయ్యాయో ఏమో గానీ, ఇదే మాటలను పలు సార్లు రిపీట్ చేసారు.
అయితే… తీరా జరిగినదేమిటంటే… ఆరు గంటల విచారణ అనంతరం భూమన బయటకు వచ్చి నీతిసూక్తులు చెప్పుకొచ్చారు. విచారణ చేసిన పోలీసులు చాలా చక్కగా తనను అడిగారని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పిన భూమన, తనపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విచారణ అంటూ ఆరోపణలు చేసారు. భూమన అరెస్ట్ అవుతారేమో ఏదొక హడావుడి చేద్దామని భావించిన వైసీపీకి భూమన సాధారణంగా బయటకు రావడం షాక్ తగిలినట్లయ్యింది.



