ఏపీలో టిడిపి, జనసేనలకు ఎంతో ప్రజాధరణ, బలం ఉంది. నిజానికి బీజేపీ ఇచ్చిన 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లలో సగానికి పైగా వైసీపియే గెలుచుకుంటుందని, ఆ మేరకు తాము నష్టపోతామని టిడిపి, జనసేనలకు తెలుసు. అయినా ఆ రెండు పార్టీలు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాయో, తమ సొంత పార్టీ నేతలను కాదని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అవి ఎందుకు త్యాగం చేశాయో అందరికీ తెలుసు.
ఎన్నికలలో వైసీపి చెలరేగిపోకుండా ఎన్నికల సంఘం ద్వారా కట్టడి చేస్తుందనే ఒకే ఒక్క కారణంతో ఇన్ని త్యాగాలు చేశాయి. కానీ టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు కుదుర్చుకొని, సీట్లు తీసుకున్నప్పటికీ అవి ఆశించిన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని యాక్టివ్ చేసిందా?అంటే లేదనే అనిపిస్తోంది.
ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “రేణిగుంట వద్ద నాలుగు వైసీపి డంప్‌లు (ఓటర్లకు పంచి పెట్టేందుకు గోదాములలో సిద్దం చేసి ఉంచిన బహుమతులు) పట్టుబడినా ఇంతవరకు ఎన్నికల సంఘం స్పందించనే లేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
తాడేపల్లి పెద్దల ఒత్తిళ్ళ కారణంగానే, ఇంత పెద్ద వైసీపి డంప్ బయటపడినా ఎన్నికల సంఘం చూడన్నట్లు మౌనంగా ఉండి పోయింది. దీనిని ఏర్పాటు చేసిన వైసీపి నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేసి, ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు ఇద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాము. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించకుంటే, కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తాము,” అని అన్నారు.
ఎన్నికలకు ఇంకా సుమారు నెలన్నర రోజులు సమయం ఉండగానే వైసీపి నేతలు అప్పుడే తమ తమ నియోజకవర్గాలలో ఓటర్లకు రకరకాల బహుమతులు, కొందరు నగదు కూడా పంచిపెడుతున్నారు. అన్ని వార్తా పత్రికలలో వైసీపి నేతల ప్రలోభాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
వాటిని ఎన్నికల సంఘం చూడలేదనుకున్నా రేణిగుంట గోదాములలో పట్టుబడిన సరుకుని కూడా చూడలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే, టిడిపి, జనసేనల త్యాగాలు వృదా అయిన్నట్లే భావించవచ్చు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే, టిడిపి, జనసేనలు బీజేపీతో తెగ తెంపులు చేసుకొని దానికి ఇచ్చిన 6/10 స్థానాలలో తమ తమ అభ్యర్ధులను ప్రకటించుకుంటే కనీసం ఆ మేరకు లాభపడతాయి కదా?






