BJP Shocking Vicctory in Telangana MLC Elections

తెలంగాణలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ బీజేపీ అనూహ్య విజయం అందుకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర్ర తరువాత జరిగిన ఎన్నికలలో తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న బీజేపీ విజయం సాధించడం అంటే అది ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలా.?

లేక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బిఆర్ఎస్ బలహీనతగా పరిగణించాలా.? దాదాపు పదేళ్ల అధికారం తరువాత వచ్చిన ఓటమితో బిఆర్ఎస్ ఒక్కసారిగా కుదేలయింది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వడం, పార్టీలోని సీనియర్ నాయకులు పార్టీ కండువాలు మార్చడం, కేసీఆర్ సంతానం కవిత అరెస్టు, కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు ఇలా ఆ పార్టీ కి సంబంధించిన ప్రతి అంశం తెలంగాణ ప్రజలలో ఆ పార్టీ పై నమ్మకాన్ని సడలేలా చేసాయి.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నప్పటికీ పార్టీ అధినేతగా కేసీఆర్ మాత్రం ప్రజల తరుపున స్వరం వినిపించడం లేదు. దీనితో తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ తన హక్కుని, అవకాశాన్ని చేచేతుల బీజేపీ నేతలకు అప్పగిస్తుంది.

రాష్ట్రంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను, బిఆర్ఎస్ బలాన్ని అటు రేవంత్ సర్కార్ తో పాటుగా ఇటు తెలంగాణ ప్రజలకు నిరూపించుకోవాల్సిన సమయంలో పోటీ నుంచి నిష్క్రమించి తన బలాన్ని బీజేపీ కి అప్పగించారు, అలాగే తన పార్టీ బలహీనతను ప్రజల ముందు ఆవిష్కరించారు.

Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?

బిఆర్ఎస్ చేజార్చుకున్న అవకాశాన్ని తన అదృష్టంగా మలుచుకోవడంలో బీజేపీ వంద కి వంద శాతం సఫలమయ్యింది. బిఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇక ఎమ్మెల్సీ పోరు లో నువ్వా – నేనా అన్నట్టుగా తలపడ్డ కాంగ్రెస్, బీజేపీ లు కారు బలాన్ని హరించారు. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పై బీజేపీ సాధించిన విజయంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మాదిరి అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి రెంటికి చెక్ పెట్టినట్లయ్యింది.




ఇటు ప్రభుత్వ వ్యతిరేకతను, అటు ప్రతిపక్ష ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకోవడంతో బీజేపీ పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దీనితో బీజేపీ విజయం అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ప్రతిపక్షం, మరో రాజకీయ ప్రత్యర్థి సిద్దమయ్యినట్టే, అలాగే ప్రతిపక్ష బిఆర్ఎస్ కు పక్కలో బెల్లం మాదిరి తమ పార్టీ కి మరో రాజకీయ ప్రత్యామ్నాయం తయారయ్యినట్టే.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?