బిజేపి వరుస విజయాలకు కారణం ఎవరు? అని అడిగితే ప్రధాని మోడీ, అమిత్ షాలని టక్కున సమాధానం చెప్తారు ఎవరైనా.ఎందుకంటే అది కళ్ళకు కనబడుతున్న వాస్తవం కనుక!
కానీ కనపడని వాస్తవం రాహుల్ గాంధీ అని చెప్తున్నారు తమిళనాడులో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.
చెన్నైలో అయన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “మన వలన కాంగ్రెస్ పార్టీ లాభపడింది. రాజ్యసభసీట్లు సంపాదించుకుంది. తాజా ఎన్నికలలో మన సహాయసహకారాలతో 5 సీట్లు గెలుచుకుంది.
కానీ పదవీ అధికారం కోసం అది మనల్ని మోసం చేసి టీవీకే పార్టీతో చేతులు కలిపింది. ఈ నమ్మక ద్రోహాన్ని ప్రతీ డీఎంకే నేత, కార్యకర్త గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి.
ఇంతకాలం నేను కూడా ప్రధాని మోడీ, అమిత్ షాల వల్లనే దేశంలో బిజేపి వరుస విజయాలు సాధిస్తోందని నమ్మేవాడిని. కానీ బిజేపికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణి ఈవిధంగా ఉన్నందునే దేశంలో బిజేపి వరుస విజయాలు సాధించగలుగుతోందని నాకు ఇప్పుడు అర్దమైంది.
కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా అవకాశవాద రాజకీయాలు చేస్తుంటుంది కనుకనే ఆ పార్టీని, దాని నాయకత్వాన్ని ఎవరూ నమ్మరు. ఇప్పుడు తమిళనాడులో కూడా అది విశ్వసనీయత కోల్పోయింది,” అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ చెప్పినది అక్షరాల నిజమని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు నిరూపించుకుంది. ఇప్పుడు మరోసారి నిరూపించుకుంది అంతే!
కాంగ్రెస్ పార్టీకి ఈ అవలక్షణంతో పాటు నాయకత్వ లోపం కూడా ఉంది. కనుక ఉదయనిధి చెప్పినట్లుగా కాంగ్రెస్ తనంతట తాను ఎన్నటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. కర్ర పెత్తనం చేస్తూ ఇండియా కూటమిని రానీయదు.
కాంగ్రెస్-ఇండియా కూటమి రాలేనప్పుడు మోడీ, అమిత్ షాల నేతృత్వంలోని బిజేపియే వస్తుంది కదా!




