bjp-targets-telangana

ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపి ఘన విజయం సాధించడంతో నేడు ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాతో పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సిఎం, డెప్యూటీ సిఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, బీజేపి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఢిల్లీలో ఆమాద్మీ పార్టీని దాని అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ని వారి చీపురు కట్టతోనే ఊడ్చేసిన తర్వాత బీజేపి అధిష్టానం ఆమాద్మీ అధికారంలో ఉన్న పంజాబ్‌పై దృష్టి సారించింది.

Also Read – బెట్టింగ్ యాప్స్: డబ్బు మాకు.. బాధ్యత సమాజానీదీనట!

దక్షిణాది రాష్ట్రాలలో బీజేపి ఇప్పటికే కర్ణాటకలో రెండుసార్లు అధికారంలో ఉంది. కనుక భవిష్యత్‌లో మరోసారి తప్పకుండా వస్తుంది.

తమిళనాడు రాజకీయాలను శాశించిన జయలలిత మృతి చెందిన తర్వాత అన్నాడీఎంకే పార్టీని కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకోగలిగింది కానీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది.

Also Read – అయ్యో! మన హిస్టరీ అంతా అలా చెప్పేస్తున్నారేమిటి?

వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీ సాయంతో అధికారంలోకి రావాలని బీజేపి ఆశిస్తున్నప్పటికీ, కోలీవుడ్‌ హీరో విజయ్ సొంత పార్టీతో ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

కనుక తమిళనాడులో బీజేపికి అధికారంలోకి రావడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. కేరళలో బీజేపి మెల్లగా ఎదుగుతోంది కనుక ఇప్పుడప్పుడే దాని ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.

Also Read – కొత్త జట్టుకు పాత గుర్తులు ఇవ్వగలడా..?

ఇక ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు పార్టీల మద్య మంచి సఖ్యత ఉంది. పైగా ఏపీలో బీజేపికి పెద్దగా ప్రజాధరణ లేదు. కనుక కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

తెలంగాణలో బీజేపి చాలా బలంగా ఉంది. 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపి విజయం సాధించి అధికారంలోకి వస్తుందనుకున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని మార్చేయడంతో తీవ్రంగా నష్టపోయింది.

కానీ ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి బలహీనపడగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలల పాలన తర్వాత కూడా నేటికీ తడబడుతూనే ఉంది. ప్రభుత్వ వైఫ్యల్యాలు, తప్పిదాల కారణంగా కాంగ్రెస్‌ గ్రాఫ్ పడిపోతూనే ఉంది.

కనుక దక్షిణాది రాష్ట్రాలలో బీజేపి తదుపరి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే 2028 ఎన్నికల వరకు ఓపికగా వేచి చూస్తుందా లేక కేసీఆర్‌తో చేతులు కలిపి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం చేజిక్కించుకుంటుందా?అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.