ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. చంద్రబాబు వరుస సమీక్షా సమావేశాలతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు.
ఇక జగన్ తాయిలాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇక పొత్తుల చర్చలు కూడా గట్టిగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయం, వామపక్షాలు కూడా జాయిన్ కావొచ్చు.
ఇక బీజేపీ ఎటువైపు ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. గడచిన వారం రోజులుగా ఈ విషయంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కేబినెట్ లో చేరడానికి సిద్ధంగా ఉందని వార్తలు మొదలయ్యాయి అప్పటినుండి.
అలాగే కేంద్రంలో బీజేపీని సమర్ధించే రిపబ్లిక్ ఛానల్ ఈ నెల 18న జరిగే ఎన్డీయే పక్షాల మీటింగ్ కు టీడీపీ కూడా హాజరు అవుతుందని ఒక వార్త ప్రసారం చేసింది. అయితే ఇందులో ఏది నిజం?
ఈ మధ్య కాలంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జగన్ మీద అత్యంత సానుకూలత చూబిస్తుంది. అడక్కుండానే అప్పులు, రకరకాల పేర్లతో నిధులు ఇస్తుంది వాటితో జగన్ పప్పుబెల్లాలు పంచేస్తున్నారు.
మరోవైపు… కేంద్ర సహకారం ఎన్నికల సమయంలో అవసరమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క శాతం ఓటు కూడా లేని బీజేపీ కోసం ఈ తాపత్రయం రాష్ట్ర రాజకీయాలను మార్చే అవకాశం ఉంది.
రాజకీయ లెక్కలు ఎలా ఉన్నా… బీజేపీ తో పొత్తు అంటే ఎవరికైనా నష్టమే.
టీడీపీ, జనసేనకు ఎన్నికల సమయంలో కేంద్రం మద్దతు ఉండకూడదు అనే కోరిక తో జగన్ ఎన్డీయే లో చేరవచ్చు. అయితే అలా చేరిన పక్షంలో జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన మైనారిటీలు, అలాగే ఎస్సీలు దూరం కావొచ్చు. దీనితో మొత్తం ఫలితాలు తారుమారు కావొచ్చు.
ఇక టీడీపీ, జనసేన విషయానికి వస్తే… ఒకప్పుడు విభేదించి విడిపోయి ఇప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? మైనారిటీ, ఎస్సీల ఓట్లయితే చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక భారీగా సీట్లు అడిగి తీసుకుంటే అవి బంగారు పళ్లెం లో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇచ్చినట్టే.
అంతే కాకుండా బీజేపీ పెళ్లి ఇక్కడ చేసుకుని చీకట్లో వైసీపీతో సంసారం చేసే టైపు. పొత్తు ఉన్నా లోపాయికారంగా తెరవెనుక వైఎస్సార్ కాంగ్రెస్ కి సపోర్ట్ చెయ్యడం ఖాయం.
కాబట్టి బీజేపీ తో పొత్తు అనేది ఏ పార్టీకీ మంచిది కాదు అనే చెప్పుకోవాలి. అయితే పార్టీ అధినేతల ఉత్సాహం చూస్తుంటే ఎవరో ఒకరు తగిలించుకునే లాగే ఉన్నారు.
దారిన పోయే దరిద్రాన్ని ఎవరు అంటించుకుంటారో? అంటూ ఈ విషయంగా సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.



