
లా చదివిన ఓ వ్యక్తి క్రిమినల్ లాయర్‌గా రాణిస్తే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కానీ నేర ప్రవృత్తి కలిగి, ఓ బలమైన రాజకీయ పార్టీలో ఉంటే… ఏవిదంగా వ్యవహరిస్తాడో, అలా వ్యవహరిస్తే చివరకు ఏం జరుగుతుందో అర్దం చేసుకునేందుకు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌ఓ ప్రత్యక్ష నిదర్శనం.
అతనిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేయించి జైల్లో పెట్టిందని వైసీపీ నేతలు వాదిస్తుంటారు. కానీ అతను ఓ రౌడీ షీటర్ అని గుంటూరు పోలీస్ రికార్డులలో ఎప్పటి నుంచో ఉందంటే వాస్తవం అర్దం చేసుకోవచ్చు.
Also Read – మంచు ఫ్యామిలీ వార్: ఇక్కడ కూడానా…?
కోర్టు నుంచి బెయిల్ ఎలా సంపాదించుకోవాలో లా చదివిన అతని కంటే బాగా ఎవరికి తెలుస్తుంది. అందుకే తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని, ఆమెకు బైపాస్ సర్జరీ జరిగిందని నకిలీ సర్టిఫికేట్లు పెట్టి, బెయిల్ పొంది బయటకు రాగానే మాయం అయిపోయాడు. అంటే చాలా తెలివిగా ప్లాన్ చేసి జైలు నుంచి బయటపడి పారిపోయాడని అర్దమవుతూనే ఉంది.
ఇంత తెలివిగా ప్రవర్తించిన బోరుగడ్డ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై కూడా చాలా తెలివిగా స్పందించడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. అజ్ఞాతంలో ఉన్న అతను మీడియాకు ఓ వీడియో మెసేజ్ విడుదల చేశాడు.
Also Read – పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదట!
దానిలో తన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉంటే నాలుగు నెలలుగా తనకు బెయిల్ రాకుండా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురూ కలిసి అడ్డుకుంటున్నారని, జైలులో తన చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించాడు.
తనకు, తన కుటుంబానికి వారు ముగ్గురి వలన ప్రాణహాని ఉందని, తమకు ఏదైనా జరిగితే అందుకు వారు ముగ్గురే బాధ్యులని ఆ వీడియోలో చెప్పాడు.
Also Read – ఈయనకి ఎవరైనా కాస్త చెప్పండర్రా!
జైల్లో ఉన్న తాను తల్లికి బైపాస్ సర్జరీ జరిగినట్లు నకిలీ సర్టిఫికెట్స్ ఎలా సృష్టించగలనని, ఒకవేళ సృష్టించినా వాటన్నిటినీ పరిశీలించిన తర్వాతే కోర్టు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కదా?అని ప్రశ్నించాడు.
లా చదివిన వ్యక్తిగా తాను న్యాయస్థానాలను ఎప్పుడూ గౌరవిస్తానని, ప్రాణమైన వదులుకుంటాను కానీ కోర్టు ధిక్కరణకు పాల్పడనని బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పాడు.
తనకు వైసీపీ కుటుంబం వంటిదని, జగన్ తండ్రి వంటివారని వారినే నమ్ముకుని జీవిస్తున్నానని బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్పాడు.
ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని, తన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం తన బెయిల్ పొడిగించాలని ఆ వీడియో సందేశంలో బోరుగడ్డ అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశాడు.
అతను చెప్పిన దాని ప్రకారమే చూసినా జైల్లో ఉండగానే మెడికల్ సర్టిఫికెట్స్ సమర్పించారు కదా?తనకు బెయిల్ రాకుండా సాక్షాత్ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని చెప్పిన నోటితోనే, నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు మద్యంతర బెయిల్ పొందానని స్వయంగా చెప్పుకున్నాడు కదా?కోర్టుని ధిక్కరించనని చెపుతూనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కదా?
అరెస్ట్ అయినప్పుడు పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల చేతే సేవలు చేయించుకున్న ఘనుడు బోరుగడ్డ. అటువంటి వ్యక్తిని జైల్లో పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారంటే నమ్మశక్యంగా ఉంటుందా?
ఒకవేళ నిజంగానే జైల్లో పోలీసులు చిత్రహింసలు పెడుతుంటే, నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు బెయిల్ సంపాదించుకున్న బోరుగడ్డ ఇదే విషయం వైసీపీ ఆస్థాన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు?
తన తల్లిని చూసుకునేందుకు ఎవరూ లేరని చెపుతున్నప్పుడు, ఆమెను ఎవరు చెన్నై తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించి లక్షల రూపాయలు ఖర్చు చేసి బైపాస్ సర్జరీ చేయించారు?
తనకు ఎవరూ దిక్కు లేరని చెపుతూనే తన వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నారని స్వయంగా చెప్పుకున్నారుగా?జగన్ రాజకీయ శత్రువుల పేర్లనే బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా చెప్పడాన్ని ఏవిదంగా చూడాలి? అని ఆలోచిస్తే ఈ స్టోరీలో రెండో కోణం, ఈ కేసులో బాధితుడుగా, న్యాయవాదిగా, వైసీపీ నేతగా బోరుగడ్డ త్రిపాత్రాభినయం కనబడుతుంది.