
ఏపీలో రెండు పట్టభద్ర, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.
వీరిలో ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖరంలకు కూటమి మద్దతు ప్రకటించింది కనుక వారి విజయం దాని ఖాతాలోనే పడుతుంది.
Also Read – జగన్ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని
కానీ గాదె శ్రీనివాసులు నాయుడు చేతిలో కూటమి మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘువర్మ ఓడిపోవడంతో గాదె గెలుపుని వైసీపీ గెలుపుగా, కూటమి ఓటమిగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెప్పుకుంటున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడుని గెలిపించడం ద్వారా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారని బొత్స సత్యనారాయణ అన్నారు.
Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?
సిఎం చంద్రబాబు నాయుడు హామీలు అమలుచేయకుండా ఉపాధ్యాయులని మోసం చేస్తున్నందునే వారు కూటమి బలపరిచిన అభ్యర్ధిని ఓడించారన్నారు. చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలలో పెరిగిన వ్యతిరేకతకి ఈ ఫలితమే నిదర్శనమన్నారు.
బొత్స చెప్పిన లెక్క ప్రకారమే ఈ ఫలితాలను చూస్తే, ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలో కూటమి బలపరిచిన ఇద్దరు అభ్యర్ధులు గెలిచారు కనుక ఆయా జిల్లాలలో ప్రజలు వైసీపీని మరోసారి తిరస్కరించారని భావించాల్సి ఉంటుంది కదా?
Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్
ఈ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార ప్రతిపక్షాలు దూరంగా ఉండి ఉంటే ఈ డెబిట్, క్రెడిట్ గోల ఉండేదే కాదు. కానీ ఆ వర్గాలపై కూడా పట్టు సాధించేందుకు లేదా పట్టు ఉందని నిరూపించుకునేందుకు, గెలిచిన ఎమ్మెల్సీలతో తమకు బలం పెరుగుతుందనే ఆలోచనతో అధికార, ప్రతిపక్షాలు తమకు సంబంధమే లేని ఈ ఎన్నికలలో కూడా వేలుపెడుతుంటాయి. రోకట్లో తల పెట్టాక పోటు పడక తప్పదు. కనుక ఒడిపోతే విమర్శలు, గెలిస్తే గొప్పలు మామూలే.
అయినా వైసీపీని ఓడించి జగన్‌కి ప్రధాన ప్రతిపక్షనేత హోదా కూడా దక్కకుండా చేసింది రాష్ట్రంలో ఉపాధ్యాయులే కదా? అందుకేగా ఉపాధ్యాయులకు పోలింగ్ డ్యూటీ వేయకుండా పక్కన పెట్టాలని జగన్ ప్రభుత్వం విఫల ప్రయత్నాలు చేసింది?
ఉపాధ్యాయులను 5 ఏళ్ళపాటు వేధించి, ఇప్పుడు వారిని వెనకేసుకువస్తే ఎందుకో గ్రహించలేరని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నట్లున్నారు. ఆనాడు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఉపాధ్యాయుల పట్ల తాను ఎంత అనుచితంగా వ్యవహరించానో బొత్స సత్యనారాయణ ఓసారి గుర్తుచేసుకుంటే ఆయన ఈవిదంగా మాట్లాడగలిగేవారు కారు.