ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మొదట ఆ పదవి వద్దని బెట్టు చేసినప్పటికీ ఇప్పుడు బాగానే కుదురుకొన్నట్లున్నారు. అందుకే ఇప్పుడు తన శాఖకు సంబందించినా వ్యవహారాలపై ధాటిగానే మాట్లాడుతున్నారు. అయితే తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో చేస్తున్న మార్పులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుండటమే ఆయనకు కాస్త అసహనానికి లోనవుతున్నారు.
సోమవారం అమరావతిలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ పాఠశాలల స్థాయికి ఎదగాలని, వాటిలో చదువుకొనే విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలలో చదువుకొనే విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. కనుక వాటి ఫలితాలు వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది.
ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ భాగస్వాములే కనుక ఉపాధ్యాయుల సలహాలను సూచనలను కూడా స్వీకరిస్తూ సంస్కరణలను అమలుచేస్తున్నాం. కొన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంపై తల్లితండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు కానీ ఉపాధ్యాయులు అభ్యంతరం చెపుతుండటమే మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ అభ్యంతరాల వెనుక ఎవరో ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఉపాధ్యాయులు అటువంటి వారికి దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం మంచిదే కానీ పాఠశాలల విలీనాన్ని అడ్డుకోవాలని చూసేవారు కోరి సమస్యలు కొని తెచ్చుకొంటున్నట్లే,” అని అన్నారు.
పాఠశాలల విలీనంపై తొలుత అభ్యంతరాలు చెప్పిందీ… రోడ్లపైకి వచ్చి రాస్తా రోకోలు చేసిందీ… విద్యార్థుల తల్లితండ్రులే కానీ ఉపాధ్యాయులు కాదని మంత్రి బొత్స కూడా కళ్ళారా చూశారు. కానీ ఆయన ఉపాధ్యాయులపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదనే చెప్పాలి. విద్యారంగంలో సంస్కరణల పేరుతో చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు ఫలితాల కోసం ఎంతో కాలం ఎదురుచూడనవసరం లేదు. వచ్చే ఏడాది పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు సరైనవా కావా? అని తేలిపోతుంది. అప్పుడూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇదే మాటలకు కట్టుబడి ఉండగలిగితే చాలు.