బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 4-5 నెలలు చాలా జాగ్రత్తగా సంరక్షణ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యంగా ఎదుగుతుంది. అదేవిదంగా రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ కేసీఆర్ తమతమ రాష్ట్రాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ అభివృద్ధిపధంలో నడిపారు.
తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం పదేళ్ళపాటు కొనసాగడంతో ఆ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. కానీ ఏపీలో అందుకు భిన్నంగా జరగడంతో అత్యంత అమూల్యమైన 5 ఏళ్ళ సమయం వృధా అయిపోయింది. పైగా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.
Also Read – ఐటి దాడులు జరుగకపోతేనే ఆశ్చర్యపడాలి
కనుక సిఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు నడుం బిగించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. రాష్ట్రానికి కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.
వాటిలో ఓం ప్రధమంగా చెప్పుకోవలసింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్). పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని రామాయపట్నంలో రూ.95,000 కోట్ల పెట్టుబడితో భారీ చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ ప్లాంట్), పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతోంది.
Also Read – జగన్ కేసులు: ఉపాధి హామీ పదకాలే.. కొనసాగితేనే బెటర్!
రామాయపట్నంలో బీపీసీఎల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఆ సంస్థ కి నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కి తెలియజేస్తూ ఓ లేఖ వ్రాసింది. తొలిదశలో రూ.6,100 కోట్లు వ్యయంతో ప్లాంట్ ఏర్పాటుకి సర్వం సిద్దమైంది.
ఈ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఎకరాలు కేటాయిస్తోంది. భూసేకరణ కోసం బీపీసీఎల్ రూ.4,600 కోట్లు ఖర్చు చేయబోతోంది.
Also Read – ‘ముద్రగడ’ పోయి…’జోగయ్య’ వచ్చారా.?
ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి లభించనున్నాయి.
కనుక బీపీసీఎల్ ప్రాజెక్టుని దక్కించుకునేందుకు గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కానీ కేంద్రంలో టీడీపీ మంత్రులు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి కృషి చేసి ఈ భారీ ప్రాజెక్టుని ఏపీకి సాధించగలిగారు.
విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర జిల్లాలు, కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు అయితేనే రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందుతాయంటూ వితండవాదం చేస్తూ జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు కాలక్షేపం చేసిందే తప్ప కనీసం వాటినీ ఏర్పాటు చేసి తమ వాదనలు నిజమని నిరూపించుకోలేకపోయింది.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీపీసీఎల్‌తో సహా మరో పది అతిపెద్ద పరిశ్రమలను ఏపీకి రప్పిస్తూ అభివృద్ధికి సరైన నిర్వచనం ఆచరణలో చూపిస్తోంది.
దార్శనీకుడైన చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల నిబద్దత కలిగిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటుకావడం, టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండటం, మోడీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు అవసరంపడటం వంటివన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని సూచిస్తున్నట్లే ఉన్నాయి. కనుక రాబోయే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి.