వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర్రారు. గురువారం ఉదయం ఆమె భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళగా అక్కడ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమెకు తెలంగాణ కాంగ్రెస్‌లో చోటు లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినందున, కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు ఆమె ఏపీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌కి వస్తుండటంపై సీనియర్ టిడిపి నేత బీటెక్ రవి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
బుధవారం ఆయన కడప నుంచి విజయవాడ బయలుదేరి వెళుతున్నప్పుడు కడప విమానాశ్రయంలో విమానం కోసం ఎదురుచూస్తుండగా, అదే విమానంలో బయలుదేరబోతున్న వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ వచ్చి పలకరించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుకొన్నామని బీటెక్ రవి చెప్పారు.
“జగన్మోహన్ రెడ్డి తమని ఇబ్బంది పెట్టడం వలననే తెలంగాణకు వెళ్ళిపోయామని అనిల్ కుమార్ చెప్పారు. అక్కడ ఆమె ఇబ్బంది పడుతున్నప్పటికీ ఏపీ రాజకీయాలలో వస్తే తాను, అన్న జగన్ ఇద్దరూ కూడా ఇబ్బంది పడవలసి వస్తుందని ఇంతకాలం వైఎస్ షర్మిల వెనకడుగువేశారు.
అయితే ఆనాడు ఆమె తెలంగాణ వెళ్ళడానికి, ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లోకి రాబోతుండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమని అనిల్ కుమార్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తమని ఆదరించి ఉండి ఉంటే నేడు ఈవిదంగా జరిగి ఉండేదే కాదన్నారు. అయినప్పటికీ వైఎస్ షర్మిల రాజకీయాలను పక్కన పెట్టి అన్నావదినలను తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించామని అనిల్ కుమార్ చెప్పారు,” అని బీటెక్ రవి అన్నారు.
టిడిపి, జనసేనలు కలవకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుకొంటే వాటిని ఆయనే స్వయంగా దగ్గర చేశారు. తల్లిని, చెల్లిని వైసీపి నుంచి బయటకు పంపించేస్తే, ఆయన కారణంగానే వారు మళ్ళీ ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నారు.
వైసీపిలో వారికి చోటు లేదని బయటకు పంపించేస్తే, ఇప్పుడు వైఎస్ షర్మిల వైసీపిలో అసంతృప్త నేతలతోనే ఏపీ కాంగ్రెస్‌ని పునర్నిర్మించుకోబోతున్నారు.ఆమె చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో చేతులు కలపకూడదని జగన్మోహన్ రెడ్డి ఆరాటపడుతున్నారు లేదా కలుపుతారని భయపడుతున్నారు. రేపు అదే జరుగబోతోంది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా?




