తెలంగాణ రాష్ట్రవిభజన జరుగుతున్న సమయంలో (2014)లో ఎన్నికలు జరిగాయి. అటువంటి సమయంలో కూడా తెలంగాణలో టిడిపి 15 సీట్లు గెలుచుకోగలిగింది. ఆ తర్వాత తెలంగాణ సిఎం కేసీఆర్ తన అధికారానికి, పార్టీకి ఎదురులేకుండా చేసుకొనేందుకు కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలని టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకొన్నారు. అయితే నేటికీ తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలు నిలిచే ఉన్నాయని అందరికీ తెలుసు. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, ఒకదానిపై మరొకదాని రాజకీయ ప్రభావం ఉంటూనే ఉంది.
తెలంగాణ సిఎం కేసీఆర్, ఏపీలో టిడిపి, జనసేనలని దెబ్బ తీసి వైసీపీకి మేలు చేసేందుకు ఏపీ రాజకీయాలలో వేలుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తన బిఆర్ఎస్ పార్టీని ఏపీలో విస్తరించేందుకు తోట చంద్రశేఖర్‌ని అధ్యక్షుడుగా అప్పగించారు. కులమతాల పేరుతో బిజెపి దేశ ప్రజల మద్య చిచ్చుపెడుతోందని వాదిస్తున్న కేసీఆర్, ఏపీలో కుల ప్రాతిపదికనే రాజకీయాలు ప్రారంభించారు. ఏపీలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కనుక కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
సెంటిమెంట్ వాడుకోవడంలో చాలా దిట్ట అయిన కేసీఆర్ ఏపీలో అమరావతి, విశాఖ ఉక్కు అనే రెండు బలమైన సెంటిమెంట్స్ ఉన్నాయని బాగానే గుర్తించిన్నట్లున్నారు. అందుకే ఏపీలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే మూడేళ్ళలో అమరావతి నిర్మిస్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిస్తామని మీడియాకి లీకులు ఇప్పిస్తున్నారు. అయితే ఏపీలో, కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోయినా ఇలాంటి హామీలు, సెంటిమెంట్లతో ఓటర్లను ఆకట్టుకొని ఓట్లు చీల్చగలదు. ఏపీ రాజకీయాలని ఎంతో కొంత ప్రభావితం చేయగలదు.
కనుక ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లు చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో టిడిపిని మళ్ళీ యాక్టివ్ చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ చేతికి పార్టీ పగ్గాలు అప్పగించగా ఆయన ఖమ్మంలో తొలి టిడిపి బహిరంగసభని విజయవంతంగా నిర్వహించారు. మార్చి 29న టిడిపి వ్యవస్థాపక దినోత్సవంనాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపికి పునర్వైభవం సాధించేందుకు ఆయన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ అనే మరో కార్యక్రమం చేపట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి హయాంలో హైదరాబాద్ నగరానికి ఐటి కంపెనీలని రప్పించి ఏవిదంగా అభివృద్ధికి తోడ్పడ్డామో వివరించారు. కులమతప్రాంతీయ భేదాలు చూపకుండా తెలుగు ప్రజల తరపు నిలబడింది టిడిపియే అని అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో తెలంగాణలో టిడిపి పునర్వైభవం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేశారంటే ఏమీ లేదు… ఎల్లప్పుడూ పేచీలు, ఎంతో కొంత నష్టం తప్ప!కనుక భవిష్యత్‌లో ఏదో చేస్తామని చెప్పి ఆంధ్రా ప్రజలని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణకి ఏమి చేశారో చెప్పుకోగలుగుతున్నారు.
ఏపీలో వైసీపీకి సహాయపడేందుకే కేసీఆర్ వస్తున్నారు. ఒకవేళ ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చి, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు వైసీపీ తప్పకుండా కేసీఆర్‌కే మద్దతు ఇవ్వడం ఖాయం. కనుక ఏపీలో బిఆర్ఎస్, వైసీపీలు తెర వెనుక ప్రరస్పరమ్ సహకరించుకోవడం ఖాయమే.
ఇక తెలంగాణలో టిడిపి విషయానికి వస్తే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో స్థిరపడిన ఆంధ్రా ఓట్లర్లని టిడిపి ఆకట్టుకోగలిగితే చాలు… కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నష్టపోతాయి. ఒకవేళ తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే పరిస్థితిలో ఉంటే, అప్పుడు టిడిపి మద్దతు చాలా అవసరం ఉంటుంది. కనుక ఇక్కడ ఏపీలో కేసీఆర్, అక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడి రాజకీయాలను వ్యూహాత్మకమైనవిగానే భావించవచ్చు. ఈసారి ఇద్దరిలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి.





