చెల్లి అట్లతద్ది… అన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ అంటున్నారు దేనికో?

BRS_KTR_Kavithaతెలంగాణ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన పార్టీని విస్తరించి, వచ్చే ఎన్నికలలో పోటీ చేయించబోతున్నట్లు చెప్పారు. కనుక ఇప్పుడు హటాత్తుగా బిఆర్ఎస్‌ నేతల స్వరం మారింది. ఆంధ్రామీద ప్రేమ పుట్టుకొచ్చింది. టిఆర్ఎస్‌ బిఆర్ఎస్‌ పార్టీగా మారడంతో, కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి కూడా భారత్‌ జాగృతిగా మారింది. ఆయా రాష్ట్రాలలో పండుగలు, సంస్కృతీ సాంప్రదాయాలను భారత్‌ జాగృతి గౌరవిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

ఏపీలో మహిళలు పేడముద్దలు (గొబ్బెమ్మ)లతో పండగ చేసుకొంటారని, ఆంధ్రా వాళ్ళ బిర్యాని పేడముద్దలా ఉంటుందని ఒకప్పుడు బిఆర్ఎస్‌ నేతలు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలంగాణకు బతుకమ్మ ఎలాగో ఆంద్రులు సంక్రాంతి అటువంటిదని, అట్లతద్దెతో ఆంద్రుల సంప్రదాయం ఉట్టిపడుతోందని కల్వకుంట్ల కవిత సర్టిఫై చేస్తున్నారు.

ADVERTISEMENT

ఆమె సోదరుడు తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ మరో అడుగు ముందుకు వేసి, కేంద్రానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రవేటీకరించవద్దని కోరుతూ లేఖ వ్రాశారు. కేటీఆర్‌కి హటాత్తుగా ఏపీ మీద ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందని సహజంగానే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వాటికి ఆయన ట్విట్టర్‌లో సమాధానమిస్తూ, “నేను 2021 నుంచే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవీటకరణను వ్యతిరేకిస్తున్నాను. పార్లమెంటులో కూడా మా పార్టీ ఎంపీలు దీనిపై అనేకమార్లు పోరాడారు. ఈ అంశంపై వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే వేలాదిమంది ఉద్యోగుల పోరాటాలకు మేము మద్దతు తెలుపుతున్నాము,” అని ట్వీట్‌ చేశారు.

అయితే బిఆర్ఎస్‌ పార్టీకి ఆంద్రాకు న్యాయం జరగాలని అంతగా తపిస్తుంటే, ముందుగా నదీ జలాలపై మడత పేచీలు పెట్టడం మానుకోవాలి. షెడ్యూల్ 9,10 కింద తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావలసిన ఆస్తుల పంపకాలు, విద్యుత్‌ బకాయిలు చెల్లింపులు చేసి ఉండేది. ఇంకా అనేక విభజన హామీలు అమలు కానీయకుండా అడ్డుపడుతూనే ఉంది. వాటి పరిష్కారానికి సహకరించి ఉండేది. కానీ జాతీయస్పూర్తితో రాజకీయాలు చేస్తామని చెపుతున్న బిఆర్ఎస్‌, ఆంధ్రా విషయానికి వచ్చేసరికి ప్రాంతీయవాదంతోనే వ్యవహరిస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై కూడా కేసీఆర్‌ ప్రభుత్వం నేటికీ అభ్యంతరాలు చెపుతూనే ఉంది.

ఏపీ రాజధాని అమరావతి పూర్తికాకుండా నిలిచిపోవడానికి 2019 ఎన్నికలలో కేసీఆర్‌ చేసిన రాజకీయాలు కూడా ఓ కారణమని అందరికీ తెలుసు. తద్వారా అమరావతికి, ఏపీకి రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులు అన్ని హైదరాబాద్‌కు తరలిపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఇలాంటి అనేక కారణాల వల్లనే బిఆర్ఎస్‌ పార్టీ అటు మహారాష్ట్ర వైపుకి వెళుతోంది కానీ ఇంతకాలం కలిసి ఉన్న ఆంద్రాలో అడుగుపెట్టలేకపోతోంది. అయితే ఏదోరోజు ఏదో ఒకటి చెప్పుకొని ఆంధ్రాలో అడుగుపెట్టక తప్పదు కనుక ఉత్తరాంద్ర ప్రజల సెంటిమెంటుతో ముడిపడున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ గురించి మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. అయినా తెలంగాణలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటివే పోరాడి సాధించుకోలేకపోతున్న బిఆర్ఎస్‌, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కోసం పోరాడుతున్నామని చెప్పడం రాజకీయం కాకపోతే మరేమిటి? ఎలాగూ కేసీఆర్‌ కేంద్రంతో యుద్ధం చేస్తున్నారు కనుక ప్రత్యేకహోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వంటి ఆంధ్రాకు చెందిన కొన్ని అంశాలను కూడా జోడించి మాట్లాడుతున్నారు అంతే. బిఆర్ఎస్‌ లక్ష్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకోవడం కాదు. ఆ పేరుతో బిఆర్ఎస్‌ పార్టీకి ఓట్లు సంపాదించుకోవడం మాత్రమే.

తెలుగు సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడు అంటే త్రివిక్రం శ్రీనివాస్‌ ఒక్కరే గుర్తొస్తారు. కానీ రాజకీయాలలో మాత్రం బిఆర్ఎస్‌ పార్టీలో అందరూ మాటల మాంత్రికులే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఓ రాజకీయ ప్రయోగశాలగా మిగిలిపోయింది. రాజధాని లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దీనావస్థలో ఉంది. ఇటువంటి బిఆర్ఎస్‌ మాటల గారడీకి పడితే మరో 5 ఏళ్ళు నష్టపోవలసి ఉంటుంది. కనుక ఆంధ్రాలో ప్రజలు వారి మాటల వెనక పరమార్ధాన్ని తెలుసుకోవడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories