వృద్ధాప్యం ఎవరినైనా క్రుంగదీస్తుంది… ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు వంటి కొద్ది మంది మాత్రం దానిని ఎదిరించి చాలా చురుకుగా ముందుకు సాగిపోతున్నప్పటికీ, సోనియా గాంధీ, కేసీఆర్ వంటివారు వృద్ధాప్య సమస్యల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇద్దరూ తరచూ ఆస్పత్రులకు వెళ్ళి వస్తూనే ఉన్నారు.
ఆమె కాంగ్రెస్ పార్టీని మల్లిఖార్జున ఖర్గే చేతిలో పెట్టారు. రాహుల్ గాంధీ కూడా చూసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య మంత్రులు, సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి విధేయంగా ఉంటున్నారు.
లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించలేనప్పటికీ గణనీయంగా బలం పెంచుకోగలిగింది. తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రాగలిగింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఇక ఎంత మాత్రం సోనియా గాంధీపై ఆధారపడి లేదని భావించవచ్చు.
కానీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేటికీ కేసీఆర్ మీదనే ఆధారపడి ఉంది. ఆయన ఏడాదిన్నరగా ఫామ్‌హౌస్‌లో ఉండిపోతే కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత ముగ్గురూ కలిసి పార్టీని నడిపించలేకపోతున్నారు. పైగా పార్టీకి మూల స్తంభాల వంటి వారి ముగ్గురి మద్య ఆధిపత్యపోరు మొదలవడంతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో అయోమయం, ఆందోళనకు గురవుతున్నాయి.
ముఖ్యంగా కల్వకుంట్ల కవిత తిరుగుబాటు తర్వాత కేసీఆర్ జోక్యం చేసుకొని సమస్యని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం, పార్టీని బీజేపిలో విలీనం చేస్తారనే ఆమె మాటలు బిఆర్ఎస్ పార్టీని మరింత దెబ్బ తీస్తున్నాయని చెప్పక తప్పదు.
ఈ పరిస్థితిలో కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో యశోదా హాస్పిటల్లో చేరడం ఆ పార్టీ శ్రేణులకు మరింత ఆందోళన కలిగించే విషయమే.
బ్లడ్ షుగర్ పెరిగి, సోడియం లెవెల్స్ తగ్గడం వలన కేసీఆర్ అస్వస్థతకి గురై నీరసించిపోయారని వాటికి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
కనుక కేసీఆర్ ఇటువంటి వృద్ధాప్య సమస్యల కారణంగానే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు హాజరవకుండా ఫామ్‌హౌస్‌లో ఉండిపోయారని భావించాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే ఆయన పార్టీ పగ్గాలు కేటీఆర్, హరీష్ రావు లేదా కల్వకుంట్ల కవితకి అప్పగిస్తే వారి మద్య ఆధిపత్యపోరు ముగుస్తుంది. పార్టీ శ్రేణులకు, రాజకీయ ప్రత్యర్ధులకు కూడా స్పష్టత వస్తుంది.
కానీ ఎల్లకాలం ఇలాగే పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఫామ్‌హౌస్‌లో మౌనంగా ఉండిపోయి, అప్పుడప్పుడు ఈవిదంగా హాస్పిటల్లో చేరుతుంటే పార్టీలో అందరికీ ఆందోళన తప్పదు. రాజకీయ ప్రత్యర్ధులు దీనిని అవకాశంగా మలుచుకొని బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.
కనుక పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలో కేసీఆర్ ఇప్పుడే నిర్ణయించుకుంటే మంచిదేమో? వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకోవడానికి, వినడానికి బాగానే ఉంటాయి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నప్పుడు దానిని గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.






