రాజకీయాలలో బూతుల సంసృతి ఏ స్థాయిలో పెట్రేగిపోతుందో, రాజకీయాలను ఏ స్థాయికి దిగజారుస్తుందో నేడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి రుజువు చేసి చూపించారు. అయితే ఇటువంటి రాజకీయ నాయకులకు అది ఎంతటి చేటు చేస్తుందో ఏపీ రాజకీయాలలో వైసీపీ పరిస్థితి చూస్తే యిట్టె అర్ధమవుతుంది.
వైసీపీ పార్టీలో బూతులు మాట్లాడిన నాయకులు, మంత్రులు అందరు 2024 ఎన్నికలలో కూటమి సునామీకి కొట్టుకుపోయారు. అయినా ఇప్పటికి వైసీపీ నేతలకి తత్త్వం బోధపడలేదు. అయితే ఇప్పుడు ఆ సంస్కృతిని తెలంగాణ నాయకులు పెంచి పోషిస్తున్నారు.
Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ప్రసంగిస్తున్న ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ప్రతిపక్ష పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ నోరు జారారు. అసెంబ్లీలో ఉన్నాం అనే కనీస సృహ కూడా లేకుండా ఏయ్ ముస్కోవయ్యా నీ…., కూచో మిమ్మల్ని బయట కూడా తిరగనివ్వం….,తోలుతీస్తా అంటూ అసభ్యపదజాలంతో బిఆర్ఎస్ నాయకుల మీద దూషణలు చేసారు.
అధికారం ఉంది కదా అనుకుని ఒక సీనియర్ పొలిటీషియన్ గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కూడా ఇటువంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తూ తెలంగాణ సమాజానికి ఎం మేలు చేయాలనుకుంటున్నారు. రాజకీయాలు చేయాలంటే ఈ రౌడీ భాష తప్పనిసరి అనే సందేశాన్ని భవిష్యత్ రాజకీయ నాయకులకు ఇవ్వాలనుకుంటున్నారా?
Also Read – ఇంతకీ షర్మిల బాణం గురి ఎవరివైపు?
ఆయన మాట్లాడారని ఈయన, ఈయన మాట్లాడారని ఆయన ఇలా ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ బూతులు అనేవి సాధారణ భాష కింద మార్చాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గా అసెంబ్లీకి వెళ్లిన వారు, మంత్రులుగా బాధ్యతలు వహిస్తున్న వారు సైతం ఇలా దిగజారుడు భాష వాడి అసెంబ్లీ కి ఉన్న విలువను దిగజారుసున్నారు. బూతులు తిట్టుకోవడానికి అసెంబ్లీ దాకా వెళ్లాలా? దానికి నడి రోడ్డు సరిపోదా?
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా తన భాష మీద కాస్త నియంత్రణ పాటించాల్సి ఉంటుంది. ఒక పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ కూడా ఒక్కో సందర్భంలో నోటిని అదుపు చేసుకోలేక విమర్శల పాలవుతున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఈ నోటి దూల కారణంగానే రాజకీయ శత్రువులను పెంచుకుంటూ పోయారు.
Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!
ఇప్పుడు అదే తరహా రాజకీయంతో కాంగ్రెస్ తెచ్చే మార్పేంటి? ప్రత్యర్థిని విమర్శించడానికి రాజకీయ నాయకులకు బూతులే అస్త్రాలు కాకూడదు, వ్యక్తిగత విషయాలే ఆయుధాలుగా మారకూడదు అనే వాస్తవాన్ని రాజకీయ నాయకులు ఎంత త్వరగా గుర్తిస్తే సమాజానికి అంత మేలు చేసిన వారవుతారు.