కేసీఆర్ ఆదేశం మేరకే దివంగత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరయ్యామని కేటీఆర్ చెప్పారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీల మొదలు సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరకు ఎవరినీ ఉపేక్షించకుండా తిట్టిపోసే కేసీఆర్, తన కొడుకుని డా.మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు పంపించడం విశేషమే.
అక్కడ కేటీఆర్ ఢిల్లీలో ఆయన అంత్యక్రియాలలో పాల్గొంటున్న సమయంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తూనే ఉంది.
డా.మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి, ఆర్ధికవేత్త, దేశానికి ఎంతో మేలు చేశారు కనుకనే పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరవుతున్నారు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంతో బిఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ కూడా హాజరయ్యారని సరిపెట్టుకోవచ్చు లేదా పనిలో పనిగా హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫార్ములా 1 రేసింగ్ కేసులో నుంచి బయటపడేయమని సాయం కోరేందుకు కావచ్చు.
ఢిల్లీ మద్యం కేసులో జైలు నుంచి తిరిగివచ్చిన తర్వాత ఓ రెండు నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్న కల్వకుంట్ల కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కనుక ఆమె రాజకీయాల గురించి కూడా ఈ సందర్భంగా రెండు ముక్కలు చెప్పుకోవడం సముచితంగా ఉంటుంది.
ఆ కేసులో ఈడీ, సీబీఐ అధికారులు తనని అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నప్పుడు, ఆమె కొంతమంది బిఆర్ఎస్ మహిళా నేతలను వెంటేసుకొని ఢిల్లీ వెళ్ళి, చట్టసభలలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. మళ్ళీ నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదు!
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ జనవరి 3 నుంచి ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేస్తామని ఆమె ప్రకటించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీలు తన జోలికి రాకుండా వాటిని దూరంగా ఉంచేందుకు 35 శాతం రిజర్వేషన్ల ధర్నా చేశారనుకుంటే, ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ధర్నాలు దేని కోసం?అంటే త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనని స్వయంగా ఆమే బయటపెట్టుకున్నారు. కనుక నిర్ధిష్టమైన ఓ రాజకీయ విధానం, చేసే ధర్నాలపై నిబద్దత లేకపోవడం గమనిస్తే, కేసీఆర్ చెప్పుకున్నట్లు బిఆర్ఎస్ పార్టీ ఫక్తూ రాజకీయ పార్టీ అని అర్దమవుతుంది. వారు ఏం చేసినా తమ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసమే చేస్తారని మరోసారి స్పష్టమవుతోంది.




