బీజేపీ, జనసేనలతో పొత్తుల కోసం అనేక సీట్లు వదులుకోవలసి వచ్చినందున, ఈసారి ఎన్నికలలో పలువురు సీనియర్ నేతలకు పోటీ చేయడానికి టికెట్లు లభించలేదు. అయితే చంద్రబాబు నాయుడు వారికి నచ్చజెప్పడంతో వారు కూడా ఎన్నికలలో పార్టీని గెలిపించుకునేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేశారు.
ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక సిఎం చంద్రబాబు నాయుడు తమకు ఏదో ఓ పదవి ఇచ్చి న్యాయం చేస్తారని వారందరూ ఎదురుచూస్తున్నారు. వారిలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కూడా ఒకరు.
Also Read – అయ్యో పాపం… వాలంటీర్లు!
కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రెండు నెలలు కావస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు పదవుల పంపిణీ గురించి ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా పాలనపై దృష్టి పెడుతుండటంతో వారిలో బుద్దా వెంకన్న ముందుగా బయటపడ్డారు.
శనివారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నప్పుడు పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు ఎటువంటి పదవి లేకపోవడంతో ప్రభుత్వంలో నా మాట చెల్లటం లేదు. ఎస్ఐలు, సీఐల బదిలీల వంటి చిన్న చిన్న పనులకు కూడా నేను మన ఎమ్మెల్యేలపైనే ఆధారపడవలసివస్తోంది. ఇది ఇబ్బందికరంగా ఉంది. నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, ప్రజలకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇందుకు క్షమించమని కోరుతున్నాను,” అని అన్నారు.
Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!
బుద్దా వెంకన్న పదవి కావాలని మనసులో మాటని ఈవిదంగా బయటపెట్టారని అర్దమవుతూనే ఉంది. అయితే ఇటువంటి మాటలు బహిరంగంగా అందరి మద్య మాట్లాడితే అవి, సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించేందుకు ప్రతిపక్షపార్టీకి చేజేతులా అవకాశం కల్పించిన్నట్లవుతుంది కదా?
పైగా ఇటువంటి మాటలు పార్టీ శ్రేణులలో కూడా అసహనం, అయోమయం సృష్టించే ప్రమాదం ఉంటుంది. పార్టీలో చాలా సీనియర్ నేత అయిన బుద్దా వెంకన్నకు నేరుగా సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి మాట్లాడే చనువు ఉంది. కనుక నేరుగా ఆయననే కలిసి తన పదవి గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా?