చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. వారిలో వైసీపీ నేత, శాప్ ఛైర్మన్ సిద్దార్ద రెడ్డి కూడా ఒకరు. ఆయన మరో అడుగు ముందుకు వేసి, రాష్ట్రంలో ప్రతిపక్షాలని ఎదుర్కొనేందుకు పెద్ద ప్రైవేట్ సైన్యమే సిద్దంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని వాలీబాల్ పోటీలని ప్రారంభించినప్పుడు సిద్దార్ద రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో మంచి మార్పు కోసం మన జగనన్న ఎంతో కృషి చేస్తుంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పొత్తుల పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఒంటరిగా వస్తున్న జగనాన్నని ఎదుర్కొనేందుకు టిడిపి, జనసేనలకు ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకొనేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే ఎన్ని పార్టీలు కలిసినా, వాటికి ఎన్ని మీడియా సంస్థలు అండగా నిలిచి తప్పుడు ప్రచారం చేసినా, అందరూ కలిసి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా వచ్చే ఎన్నికలలో మన జగనన్నని ఏమీ చేయలేరు.
జగనన్నకి అండగా పార్టీలో యువతతో కూడిన పెద్ద ప్రైవేట్ సైన్యమే ఉంది. జగనన్న కనుసైగ చేస్తే చాలు ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఆ సైన్యం సిద్దంగా ఉంది. వచ్చే ఎన్నికలలో ప్రజలు దిల్‌రాజు ఎవరో రాక్షసుడు ఎవరో గుర్తించి ఓట్లు వేయాలి,” అని అన్నారు.
యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో ప్రైవేట్ సైన్యాలు ఉంటాయని, వారు తుపాకులు పట్టుకొని తిరుగుతూ తమ ప్రత్యర్ధులని మట్టుబెడుతుంటాయని వార్తల్లో విని ఉంటాము. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీలో కూడా ప్రైవేట్ సైన్యం ఉందని ఆ పార్టీ యువనేత సిద్దార్ధ రెడ్డి స్వయంగా చెపుతుండటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. తమ వద్ద ప్రైవేట్ సైన్యం ఉందని చెపుతున్న సిద్దార్ద రెడ్డి వచ్చే ఎన్నికలలో తమ పార్టీని ఎన్నుకోవాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారా లేక హుకుం జారీ చేస్తున్నారా?



