CAG Report on Delhi Liquor Scam Submitted in Assembly

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎవరికీ అంతుపట్టని ఓ బ్రహ్మ పదార్ధం వంటిది. అరవింద్‌ కేజ్రీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులు నిజంగానే అవినీతికి పాల్పడ్డారా?లేదా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఢిల్లీలో ఆమాద్మీ పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకే కేంద్రం ఈ కేసుని సృష్టించిందా?అంటే ఎవరి వాదనలు వారు వినిపిస్తుంటారు.

ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణలో కేసీఆర్‌ గద్దె దిగిపోయారు. కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైపోయి రాజకీయాలు చేసుకుంటున్నారు. కనుక ఈ కేసుని కేంద్రం ఆటకెక్కించేసిందా?అంటే అవుననే అనిపిస్తుంది. అంటే కేజ్రీవాల్‌, కవితల వాదనలు నిజమనే భావించాల్సి వస్తుంది.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

కానీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపి ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్‌పై కాగ్ నివేదికని దుమ్ము దులిపి అటకపై నుంచి దింపి శాసనసభలో ప్రవేశపెట్టింది!

దాని ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి ఈ లిక్కర్ స్కామ్‌ వలన రూ.2,002 కోట్లు నష్టం వచ్చిందనే విషయం బయటపడింది. అంటే ఇంతకాలం ఆమాద్మీ ప్రభుత్వం ఈ కాగ్ నివేదికని అటకపై పడేసిందని అంటే అవినీతి జరిగిందని స్పష్టమవుతోంది.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

ఢిల్లీలో బీజేపి ప్రభుత్వం ఈ నివేదికని శాసనసభలో ఊరికే రాజకీయ కాలక్షేపానికి ప్రవేశపెట్టిందని అనుకోలేము. శత్రుశేషం, ఋణ శేషం ఉండకూడదంటారు పెద్దలు. ఢిల్లీలో ఆమాద్మీ పార్టీని ఓడించినప్పటికీ, పంజాబ్‌లో ఇంకా అధికారంలోనే ఉంది. కనుక ఈ బ్రహ్మాస్త్రాన్ని మరోమారు ఆమాద్మీపై ప్రయోగించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లుంది.

తీగ లాగితే డొంక కదిలినట్లు, ఈ కేసుతో మళ్ళీ ఆమాద్మీని రౌండప్ చేస్తే ఆ సర్కిల్లోకి కల్వకుంట్ల కవితకు కూడా ఆహ్వానం రాక తప్పదు!

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

కనుక తెలంగాణలో బీజేపి కోసం బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ త్యాగాలకు సిద్దపడాల్సి రావచ్చు లేదా కేసీఆర్‌ మళ్ళీ ఫామ్‌హౌస్‌లో అజ్ఞాతవాసం-2 మొదలుపెట్టాల్సి రావచ్చు.