సీబీఐ, ఈడీలకు ఒకప్పుడు చాలా విశ్వసనీయత ఉండేది. కానీ అవి కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజకీయ ఆయుధాలుగా మారిపోయినప్పటి నుంచి వాటి విశ్వసనీయత దెబ్బ తింది.
అవి ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదు చేస్తాయో.. ఎప్పుడు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తాయో.. ఎప్పుడు ఎందుకు విడిచిపెట్టేస్తాయో, ఎప్పుడు ఏ కేసుని ఎందుకు ఆటకెక్కించేస్తాయో ఎవరికీ తెలియదు.
ఓ కేసులో దోషులను అరెస్ట్ చేసి వారికి శిక్షలు పడేలా చేయలేనప్పుడు, వారి వలన దేశానికి, రాష్ట్రాలకి కలిగిన నష్టాన్ని వారి నుంచి అవి తిరిగిరాబట్టలేనప్పుడు వారి జీతాభత్యాలతో సహా ఈ కేసుల దర్యాప్తు, కోర్టులలో విచారణ పేరుతో జరుగుతున్న వ్యయ ప్రయాసలన్నీ వృధాయే కదా?
ఇందుకు మరో నిదర్శనంగా గాలి జనార్ధన్ రెడ్డి కేసు కనిపిస్తోంది. ఆయన ఏపీ, కర్ణాటక రాష్ట్రాల మద్య అటవీ ప్రాంతంలో అక్రమంగా గనులు తవ్వుకొని లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపిస్తూ సీబీఐ 2011లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది.
ఆయనకు ట్రయల్ కోర్టు, హైకోర్టు రెండూ బెయిల్ నిరాకరిస్తే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన 2015లో బెయిల్‌పై బయటకు వచ్చారు.
2011 నుంచి 2024 వరకు అంటే 13 సంవత్సరాలుగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉందంటే ఎంత గొప్పగా సాగుతోందో అర్దం చేసుకోవచ్చు.
ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టే సీబీఐకి విచారణ గదువుని పొడిగిస్తోంది. మొదటిసారి ఆరు నెలలు, తర్వాత మరో ఏడాది, మళ్ళీ మరో నాలుగు నెలలు పొడిగించింది. కానీ నేటికీ సీబీఐ విచారణ పూర్తిచేయలేదు.
కనుక సీబీఐ అభ్యర్ధన మేరకు మరో 8 నెలలు అంటే ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. ఇదే చివరి పొడిగింపని మరోసారి గడువు పొడిగించమని సుప్రీంకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది.
కనుక గాలి జనార్ధన్ రెడ్డి కధ ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి కధ కూడా కొలిక్కి వచ్చేసిన్నట్లే అని అప్పుడే కొందరు సంతోషపడుతున్నారు. వారి అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవలసిందే. కారణం అందరికీ తెలుసు.
ఇటువంటి కేసులను ఎప్పుడు ఏవిదంగా బ్రేకులు వేస్తూ ఎలా సాగదీయాలో గాలి జనార్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.
వారు అంత సమర్ధులు గనుకనే ఈ కేసుల విచారణ ఇన్నేళ్ళుగా నిరాటంకంగా సాగిపోతున్నాయి కదా?
పైగా విజయసాయి రెడ్డి పెద్దల సభలో ఢిల్లీ పెద్దల పక్కనే కూర్చొంటుండగా, బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించారు… మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెపుతున్నారు కదా?
అంటే ఈ కేసులు వారిని ఏమీ చేయలేవనే కదా అర్దం?అయినా గాలిని బందించడం ఎవరి తరం? ఆ గాలి మనదే అయితే బందించాల్సిన అవసరమేమిటి?




