కుర్ర హీరో నిఖిల్ కు కార్తికేయ 2 తర్వాత బిజినెస్ లెక్కలు మారిపోయాయి. అది ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో సంచలన విజయం నమోదు చేసుకోవడంతో అనూహ్యంగా కలిసి వచ్చిన ఇమేజ్ ని జాగ్రత్తగా పెంచుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దానికి తగ్గట్టే ఎవరికీ రాని విభిన్నమైన కథలు, దర్శకులు, బ్యానర్లు దొరుకుతున్నాయి.
అయితే స్పై విషయంలో జరుగుతున్న హడావిడి కిందటి వారం వరకు నిఖిల్ కు మింగుడు పడనిదే. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా ప్యాన్ ఇండియాకి రీచ్ అవ్వాల్సిన కంటెంట్ ఇది. కానీ నిర్మాతలు బిజినెస్ పరంగా ఉన్న అవకాశాలు, పరిమితులను దృష్టిలో పెట్టుకుని ముందు అనుకున్న జూన్ 29కే ఫిక్స్ అయిపోయి ఆఘమేఘాల మీద సెన్సార్ డబ్బింగ్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అసలైన సవాల్ ఇక ముందుంది. చేతిలో ఉన్నది కేవలం వారం రోజులు. ఈలోగా ఇతర భాషల్లో ట్రైలర్లు రిలీజ్ చేసి అక్కడ మీడియాను కలుసుకుని ఇంటర్వ్యూలు ఇస్తూ ఏపీ తెలంగాణలో బజ్ పెంచడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ తక్కువ టైంలోనే చేసి తీరాలి.
కార్తికేయ 2 అంతగా సక్సెస్ అవ్వడానికి కారణం అందులో ఉన్న శ్రీకృష్ణుడి సెంటిమెంట్, ఇది ఉత్తరాది ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ కావడంతో తెలుగుతో సమానంగా అక్కడా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ స్పై ఒక గూఢచారి కథ. నిఖిల్ దీన్ని ఇంతగా నమ్మడానికి కారణం సుభాష్ చంద్రబోస్ అంతర్ధానంని స్పైలో మెయిన్ పాయింట్ గా తీసుకోవడం. ఇది స్ట్రెకింగ్ ఎలిమెంట్ అవుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాడు.
అయితే ఇంత తక్కువ వ్యవధిలో దేశం మొత్తం రీచ్ అయ్యేలా స్పైని తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఇక్కడ మరో గండం కూడా ఉంది. అదే రోజు బాలీవుడ్ లో సత్యప్రేమ్ కి కథ రిలీజవుతోంది. కార్తీక్ ఆర్యన్ – కియారా అద్వానీ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ కం లవ్ ఎంటర్ టైనర్ మీద నార్త్ మల్టీప్లెక్స్ జనాలు ఎగబడతారు. దీన్ని ధీటుగా ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఒక రోజు గ్యాప్ తో జూన్ 30న ఇండియానా జోన్స్ డయల్ అఫ్ డెస్టినీని ఇండియాలోనూ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ముందు రోజు రాత్రే ప్రీమియర్లూ పడతాయి. ఈ పోటీ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని స్పై విజేతగా నిలవాలంటే అదిరిపోయిందనే టాక్ తెచ్చుకోవాలి. అప్పుడే ప్యాన్ ఇండియా సీన్ ఉందని ఒప్పుకోవచ్చు.





