తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కేసులపై విచారణ జరిపిస్తోంది. వాటన్నిటినీ నిజంగానే ఛేదించగలిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతలందరూ జైళ్ళకు వెళ్ళాల్సి వస్తుంది.
కానీ ఏడాదిన్నరగా విచారణలు జరుపుతున్నా ఇంత వరకు ఏ ఒక్క కేసులో ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది.
కనుక కేసీఆర్ & కోని కాంగ్రెస్ ప్రభుత్వమే కాపాడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కానీ వారిని అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుపడుతోందని, కనుక బీజేపి అధిష్టానమే కేసీఆర్ & కోని కాపాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
అంటే అటు బీజేపి, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కేసీఆర్ & కోని కాపాడుకుంటున్నాయని ప్రజలు అనుకునేలా చేస్తున్నారు.
కానీ బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేయాలని కేసీఆర్ ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత స్వయంగా ఆరోపించారు కనుక ఇదే వాస్తవమని భావించవచ్చు.
అంటే ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్, కాళేశ్వరం కేసులు, ఇంకా ఏవైనా కేసులు ఉన్నట్లయితే వాటి నుంచి తప్పించుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వం రక్షణ కవచం చాలా అవసరం.
పైగా కేసీఆర్ ఇదివరకులా ఇప్పుడు పార్టీని నడిపించేందుకు ఆసక్తి చూపడం లేదు. కనుక ఆయన స్థానం కోసం కేటీఆర్, హరీష్, కవిత ముగ్గురూ కీచులాడుకుంటున్నారనే విషయం బయట పడింది.
కనుక పార్టీని బీజేపిలో విలీనం చేసి రాజకీయాల నుంచి తప్పుకొని శేష జీవితం ప్రశాంతంగా జీవించాలని కేసీఆర్ భావిస్తున్నారేమో?
ఒకవేళ బిఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేయకపోయినా, బీజేపితో పొత్తులు పెట్టుకొని కూడా కేసీఆర్ & కో ఈ కేసుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ విషయం సిఎం రేవంత్ రెడ్డికి తెలియదనుకోలేము. కనుక కేసుల విచారణని కొనసాగిస్తూ అదును కోసం ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు. కనుక ఈ కేసులు, విచారణలు అన్నీ ముగింపులేని కధలే అని భావించవచ్చు.




