ysr-congress-party-leaders Free Publicity

పోసానిపై మరో 14 కేసులు.. రెండు కేసులలో ఊరట.. రాంగోపాల్ వర్మకి హైకోర్టులో భారీ ఊరట.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ని విచారిస్తున్న విజయవాడ పోలీసులు..

సత్యవర్ధం కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌, ఆ కేసులో బెయిల్‌ కోరుతూ వంశీ పిటిషన్‌… ఇవన్నీ చూస్తుంటే వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టి కేసులు నమోదు చేసి వేధిస్తున్నట్లనిపిస్తుంది. కానీ వాటితోనే వారికి ఉచితంగా పబ్లిసిటీ లభిస్తోంది. కనుక ఈ కేసుల గురించి వారు నిజంగా అంత బాధపడిపోతున్నారని అనుకోలేము.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

ఒకవేళ ఈ సమస్యలు మనకి వద్దనుకుంటే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం పనితీరు, విధానాలు, వైఫ్యల్యాలని ప్రస్తావిస్తూ విమర్శిస్తుంటే ఎవరూ వారి జోలికి వెళ్ళగలిగేవారు కారు. కానీ జైలుకి వెళ్ళేందుకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు కనుక వ్యక్తిగత దూషణలు, విమర్శలకు పాల్పడుతూ కొందరు చేజేతులా సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు.

మరికొందరు పూర్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకతప్పడం లేదు. కనుక రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మొగుతాయన్నట్లు ఇవన్నీ వైసీపీ చర్యలకు ప్రతిచర్యలనుకోవచ్చు.

Also Read – కోర్ట్: నాని జడ్జ్ మెంట్ బాగుంది..!

నాగబాబుకి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలనే కూటమి ప్రభుత్వం నిర్ణయంపై మాజీ మంత్రి తనదైన శైలిలో చేసిన ట్వీట్ ఇందుకు తాజా ఉదాహరణగా కనిపిస్తోంది.

“అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు,” అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇవ్వడం కూటమి అంతర్గత వ్యవహారం. కానీ అది రాజకీయ నిర్ణయం కనుక వైసీపీ నేతలు కూడా స్పందించవచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఈ విదంగా వ్యాఖ్యలు చేయడం తప్పు.

వైసీపీ అధినేత జగన్‌ తనకు ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా ఇచ్చి సభలో గౌరవించాలని కోరుతున్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి “ఆయన కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ,” అంటూ చులకన మాట్లాడారు.




కనుక ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు అంబటి వంటి వైసీపీ నేతలు ఇలా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూనే ఉన్నారు. దానికి మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. కనుక ఇది స్వయంకృతమే తప్ప కూటమి ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు.